Airtel 5G Services: దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రస్తుతం 4జీ టెక్నాలజీ కొనసాగుతోంది. ఇప్పుడు 5జీ నెట్‌వర్క్ రాబోతోంది. ఈ నెట్‌వర్క్ కోసం ఇప్పటికే పలు టెలికం కంపెనీలు ట్రయల్స్ కూడా ప్రారంభించాయి. అందుకు సంబంధించి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక 5జీ సేవలను ప్రారంభించేందుకు భారతీ ఎయిర్‌టెల్ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను ప్రారంభించబోతోంది. ఇందు కోసం కంపెనీ ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఆగస్టులోనే ఎయిర్‌టెల్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఎయిర్‌టెల్ ఎండీ సీఈవో గోపాల్ విట్టల్ వెల్లడించారు. నెట్‌వర్క్ ఒప్పందం అమలులో ఉందని, ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అత్యుత్తమ 5G కనెక్టివిటీని అందించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
అదే సమయంలో 5G స్పెక్ట్రమ్ వేలంలో మొత్తం 22 టెలికాం సర్కిల్‌ల కోసం బిడ్డింగ్ చేస్తున్న రిలయన్స్ జియో, ఆగస్టు 15, 2022న తన 5G మొబైల్ సేవను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కంపెనీ తెలిపింది.
ఏడు రోజులపాటు జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో మొత్తం నాలుగు టెల్కోలు రూ.1,50,173 కోట్ల స్పెక్ట్రమ్ కోసం బిడ్ చేశాయి. ఇందులో రిలయన్స్ జియో వాటా 59 శాతానికి చేరువలో ఉంది. రిలయన్స్ జియో రూ.88,078 కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్ కోసం బిడ్ వేయగా.. రిలయన్స్ జియో తర్వాత భారతీ ఎయిర్ టెల్ అత్యధిక స్పెక్ట్రమ్ కోసం బిడ్ చేసింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి