మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారా.? మంచి ఫోన్‌ను వెతికే క్రమంలో వాయిదా వేస్తూ వస్తున్నారా.? దీపావళి తర్వాత చూద్దాంలే అనే ఆలోచనలో ఉన్నట్లయితే వెంటనే కొనేయండని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదేంటి అంత అర్జెంట్‌గా కొనాల్సిన అవసరం ఏముందనేగా మీ సందేహం. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దీపావళి తర్వాత స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ సంస్థలు దీపావళి తర్వాత ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పెరుగుదల ఏకంగా 7 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్‌ల ధరలు పెరగడానికి రూపాయి పతనమే కారణమని తెలుస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ రోజురోజుకీ క్షీణిస్తోన్న విషయం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే గత కొన్ని రోజులు రూపాయి విలువ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మొబైల్ తయారీకి ఉపయోగించే ముడి వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం, డాలర్ల రూపంలో చెల్లింపులు చేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
కంపెనీలపై భారం పడుతోంది. దీంతో మొబైల్ ఫోన్‌ల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని సంస్థలు భావిస్తున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌లు, ప్రీమియం ఫోన్లతో పోల్చితే బడ్జెట్ ఫోన్‌ల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫీచర్ ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..