
ప్రస్తుతం వేసవికాలం మొదలుకావడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భానుడి ఉగ్రరూపంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే మొదలవుతున్న ఎండ ప్రభావం.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎండ నుంచి తట్టుకునేందుకు ఇంట్లో ఏసీలు, ఎయిర్ కూలర్లు అనేవి ఎక్కువగా వినియోగిస్తున్నారు.

అయితే ఏసీ ఉంటే మంచిదా..? ఎయిర్ కూలర్ సరిపోతుందా? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొ ప్రాంతంలో ఒక్కోలా వాతావరణం ఉంటుంది. దీంతో స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి ఏసీనా లేదా కూలర్ సరిపోతుందా? అనేది ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కూలర్ ఫ్యాన్, వాటర్ మోటార్‌తో పనిచేస్తుంది. అదే ఏసీ కంప్రెసర్, గ్యాస్, పూర్తి రిఫ్రిజిరేషన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది.

కూలర్ 100 నుంచి 300 వాట్స్ వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఇక ఒక టన్ ఏసీ సుమారు 900 నుంచి 1200 వాట్లను, ఇక 1.5 టన్ ఏసీ 1400 నుంచి 1800 వాట్లను వినియోగిస్తుంది. దీంతో కూలర్ కంటే ఏసీ బిల్లు ఎక్కువగా వస్తుంది. కూలర్ ఒక రోజులో సుమారు 8 గంటల పాటు ఆన్ చేసి ఉంచితే దాదాపు 1 నుంచి 2 యూనిట్ల విద్యుత్‌ను వాడుతుంది. అంటే నెల మొత్తం 24 నుంచి 72 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది.

సగటు యూనిట్ విద్యుత్ ధర రూ.7 నుంచి రూ.8 వరకే ఉంటే.. నెలవారీ విద్యుత్ ఖర్చు రూ.500 నుంచి రూ.800 మధ్య ఉంటుంది. ఇక 1.5 టన్ల ఇన్వర్టర్ ఏసీ 8 గంటల పాటు నడిస్తే.. 5 స్టార్ ఏసీ రోజుకు 9 నుంచి 12 యూనిట్లు, 3 స్టార్ ఏసీ రోజుకు 9 నుంచి 12 యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఇక నాన్ ఇన్వర్టర్ రోజుకు 12 నుంచి 14 యూనిట్లు వినియోగిస్తుంది. అంటే నెలకు 200 నుంచి 350 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తే నెలకు రూ.2 వేల నుంచి రూ.3,500 వరకు విద్యుత్ ఖర్చు ఉంటుంది.

కూలర్ గాలిని చల్లబర్చడానికి నీటిని ఉపయోగిస్తుంది. పొడి వేడిలో ఇది బాగా పనిచేస్తుంది. ఏసీ గదిలోని వేడిని, తేమను రెండింటిని తొలగిస్తుంది. దీంతో తేమతో కూడిన వాతావరణంలో ఇది బాగా పనిచేస్తుంది. గాలిలో తేమ ఎక్కువ ఉంటే కూలర్ బలహీనపడి ఏసీ అవసరమవుతుంది. ప్రతి ప్రాంతంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. దీంతో అందరికీ ఏసీ అవసరం ఉండదు. కూలర్ ఉంటే సరిపోతుంది. అందుకే మీ ప్రాంతంలో వాతావరణాన్ని బట్టి ఏది మంచిది అనేది ఎంచుకోండి.