Tech Tips: వారానికి ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

ఫోన్ ఎప్పుడూ ఆన్‌ లోనే ఉంటుంది. అది కొద్దిసేపు ఆఫ్ అయినా కొంతమంది ఉండలేరు. కానీ కొన్నిసార్లు ఫోన్‌ను ఆఫ్ చేసి ఉంచడమే మంచిది. వారానికి ఒకసారి మీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Tech Tips: వారానికి ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?
Why You Should Reboot Your Phone Weekly

Updated on: Sep 03, 2025 | 5:32 PM

చేతిలో ఫోన్ లేకపోతే ఏం తోచదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా.. నెట్‌వర్క్ లేకపోయినా వచ్చే చిరాకు, కోపం అంతా ఇంతా కాదు. ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేని స్థితికి మనుషులు వచ్చేశారు. అయితే వారానికి ఒకసారి మన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. కేవలం ఈ ఒక్క చిన్న పని మన ఫోన్ పనితీరును, బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా మన మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఫోన్‌ను ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభాలు

బ్యాటరీ పనితీరు మెరుగుదల: ఫోన్‌ను నిరంతరాయంగా ఆన్‌లో ఉంచడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. వారానికి ఒకసారి దాన్ని ఆఫ్ చేసి కొంతసేపు విశ్రాంతినివ్వడం ద్వారా బ్యాటరీ జీవితం పెరుగుతుంది. ఇది ఫోన్ ఓవరాల్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

ర్యామ్ రిఫ్రెష్: ఫోన్ నిరంతరంగా ఆన్‌లో ఉన్నప్పుడు అనేక అప్లికేషన్లు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉంటాయి. దీనివల్ల ఫోన్ ర్యామ్‌పై ఒత్తిడి పడుతుంది. ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల ఈ అప్లికేషన్లు క్లోజ్ అవుతాయి. ర్యామ్ రిఫ్రెష్ అవుతుంది. తద్వారా ఫోన్ వేగంగా మరింత సాఫీగా పనిచేస్తుంది.

ఓవర్‌హీటింగ్‌కు చెక్ : ఎక్కువసేపు ఫోన్‌ను వాడటం వల్ల అది వేడెక్కుతుంది. వారానికి ఒకసారి ఫోన్‌ను ఆఫ్ చేయడం వల్ల అది చల్లబడి, ఓవర్‌హీటింగ్ సమస్యలు తగ్గుతాయి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు: కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు సక్రమంగా ఇన్‌స్టాల్ కావడానికి ఫోన్‌ను రీబూట్ చేయడం అవసరం. ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా అన్ని అప్‌డేట్‌లు, కొత్త అప్లికేషన్లు సక్రమంగా ఇన్‌స్టాల్ అవుతాయని నిర్ధారించుకోవచ్చు.

వేగవంతమైన పనితీరు: ఫోన్‌ను ఎక్కువ కాలం వాడినప్పుడు దాని వేగం తగ్గుతుంది. దాన్ని ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు, క్యాష్ మెమరీ క్లియర్ అవుతుంది. ఫోన్ వేగంగా పనిచేయడం మొదలుపెడుతుంది.

డిజిటల్ డిటాక్స్: ఫోన్‌ను ఆఫ్ చేయడం ద్వారా మీరు డిజిటల్ ప్రపంచం నుండి కొంత విరామం తీసుకోవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, పనులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

నెట్‌వర్క్ సిగ్నల్ మెరుగుదల: ఫోన్‌ను రీబూట్ చేయడం వల్ల నెట్‌వర్క్ కనెక్షన్ మెరుగుపడుతుంది. కొన్నిసార్లు నెట్‌వర్క్ చాలా కాలం పాటు ఆన్‌లో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటుంది. కానీ దాన్ని ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల నెట్‌వర్క్ సిగ్నల్ మరింత బలపడుతుంది.

చిన్నదైన ఈ అలవాటు మన ఫోన్‌కే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కాబట్టి వారానికి ఒకసారైనా మీ ఫోన్‌ను ఆఫ్ చేసి, దానికీ, మీకూ కొంత విశ్రాంతి ఇవ్వండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..