హిందీని బలవంతంగా రుద్దం.. కేంద్రం

దేశంలో ఏ రాష్ట్రం పైనా హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రసక్తి లేదని కేంద్రం ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)-2019 ముసాయిదాపై ఒక్కసారిగా రేగిన వివాదాన్ని చల్లార్చే దిశలో భాగంగా ఈ విషయాన్ని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తమ ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఐడెంటికల్ మెసేజీలను పోస్ట్ చేశారు. ఈ నూతన విధానాన్ని అమలు చేసేముందు ముసాయిదాను సమీక్షిస్తామని వారు వివరించారు. స్కూలు విద్యార్థులపై హిందీని తప్పనిసరిగా రుద్ధేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ తమిళనాడులో అప్పుడే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. (నిర్మలా సీతారామన్, జైశంకర్ ఇద్దరూ తమిళనాడుకే చెందినవారు కావడం విశేషం. వీరు తమిళంలోనే ట్వీట్లు చేశారు). దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దిన పక్షంలో తాము సహించే ప్రసక్తి లేదని కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆదివారం హెచ్చరించారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కూడా వీరితో గళం కలిపారు. డ్రాఫ్ట్ పాలసీపై ప్రజల, మేధావుల అభిప్రాయాలు సేకరించాకే దీన్ని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. త్రిభాషా విధానం పేరిట ఒకే భాషను ఇతరులపై తప్పనిసరిగా విధించాలన్న యోచన సరికాదని కుమారస్వామి, ఇతరులు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా.. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు హిందీ భాషను తప్పనిసరి చేయాలని కేంద్రం యత్నించినప్పుడు ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ఒకే జాతీయ భాష ఉండాలనడం సరైనదో, కాదో విస్తృత చర్చ జరగాలని,మెజారిటీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది కేంద్ర పరిధిలోనిదే అయినా.. ఈ అంశం తమకు కూడా సంబంధించినదని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *