Virat Kohli Reveals: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా తాను తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైనట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఆ డిప్రెషన్ నుంచి బటయటపడటానికి ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కరే కారణమని కోహ్లీ తెలిపాడు. మానసిక ఒత్తిడికి సంబంధించి సచిన్‌తో మాట్లాడిన తరువాత చాలా వరకు సాంత్వన లభించిందన్నాడు. ప్రతికూల భావాలతో పోరాడవద్దని సచిన్ ఇచ్చిన సలహాతో డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు.
‘నాట్ జస్ట్ క్రికెట్’ అనే పోడ్‌కాస్ట్‌లో ప్రముఖ వ్యాఖ్యాత నికోలస్‌తో మాట్లాడిన కోహ్లీ.. ‘2014 ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. సచిన్ టెండూల్కర్‌ను సంప్రదించాను. నా పరిస్థితి గురించి ఆయనకు వివరించాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న సచిన్.. విలువైన సూచనలు చేశారు. నెగిటీవ్ ఫీలింగ్‌తో ఉన్నట్లయితే వాటిని మనసులోంచి తక్షణం తీసేయడమే ఉత్తమం అని సచిన్ చెప్పారు. నెగిటివ్ ఫీలింగ్స్‌తో పోరాటం సాగిస్తే అది మరింత బలంగా మారుతుందని, అందుకని మనలో మానసిక ఒత్తిడిని పెంచే నెగిటీవ్ భావాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సచిన్ చెప్పారు. సచిన్ చెప్పిన మాటలను నిజంగా నన్ను చాలా ప్రభావితం చేశాయి. అప్పటి నుంచి నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నాను. నెగిటీవ్ ఆలోచనలను దరిచేరనివ్వడం లేదు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కాగా, కోహ్లీ 2009 నుంచి 2013 మధ్య 31 వన్డేల్లో(2011 వన్డే ప్రపంచ కప్ సహా), 17 టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఆడాడు. సచిన్, కోహ్లీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అనేక సందర్భాల్లో కోహ్లీకి సచిన్ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేవాడు.
కాగా, ‘నాట్ జస్ట్ క్రికెట్’ పోడ్‌కాస్ట్‌లో ఇంతకు ముందు మాట్లాడిన కోహ్లీ.. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో డిప్రెషన్‌తో బాధపడ్డానని వెల్లడించాడు. ఆ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో డిప్రెషన్‌తో పోరాడినట్లు తెలిపాడు. ఆ సమయంలో తన చుట్టూ మద్దతుగా నిలిచే వ్యక్తులు ఉన్నప్పటికీ, వృత్తిపరమైన సహాయం అవసరమని బలంగా భావించానని చెప్పుకొచ్చాడు. కరోనా కాలంలో బయో బబుల్‌లో ఉండాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై చర్చ మరింత తీవ్రమైందని కోహ్లీ చెప్పాడు. టీమ్‌తో మానసిక ఆరోగ్య నిపుణుడిని కలిగి ఉండటం చాలా ముఖ్యం భారత కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
Also read:
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..