టోక్యోలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకూ జరగనున్న పారాలింపిక్స్ కోసం భారత్ పెద్ద బృందాన్నే పంపిస్తోంది. 54 మంది క్రీడాకారులను బరిలోకి దించుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కెనోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో తదితర కేటగిరీల్లో మన క్రీడాకారులు పోటీ పడనున్నారు. గత కొన్నేళ్లుగా మన అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో పారాలింపిక్స్‌లో కూడా సత్తా చాటేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. భారత్ ఇప్పటి వరకు 11 పారాలింపిక్స్ క్రీడల్లో 12 పతకాలు మాత్రమే గెలిచింది. టోక్యోలో జరగనున్న పారాలింపిక్స్‌పై భారత్‌కు భారీ అంచనాలే ఉన్నాయి. చరిత్రలోనే ఇవి మనకు అత్యుత్తమ పారాలింపిక్స్ క్రీడలు అవుతాయంటున్నారు. ఐదు స్వర్ణాలు సహా 15 పతకాలను సాధించగలమని తాము అంచనా వేస్తున్నామని తెలిపారు భారత పారాలింపిక్స్ కమిటీ సెక్రటరీ జనరల్ గరుశరణ్ సింగ్. రియో పారాలింపిక్స్ తర్వాత మన అథ్లెట్లంతా అంతర్జాతీయ టోర్నీల్లో రాణించారని వెల్లడించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, ఆర్చరీలో కచ్చితంగా పతకాలు వస్తాయని ధీమాగా ఉన్నామని తెలిపారు.
పారా హైజంప్ స్వర్ణపతక విజేత, భారత పతాకధారి మరియప్పన్ తంగవేలుపై భారీ అంచనాలు ఉన్నాయి. 2017లో కాలిమడమ గాయం తర్వాత కోలుకున్న తంగవేలు ఈ మధ్యే జరిగిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్‌లో అతడు 1.86 మీటర్లతో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారాయన.. ఆయన కచ్చితంగా స్వర్ణం సాధించగలడని అంఛనా వేస్తున్నట్లు తెలిపారు గరుశరణ్ సింగ్. ఇక ఇతర రంగాల్లోని ఆటగాళ్లు దేవేంద్ర జజారియా, సుందర్ సింగ్ గుర్జర్, అజీత్ సింగ్, సందీప్ చౌదరి, నవదీప్ సింగ్, ప్రమోద్ భగత్, కృష్ణా నగర్, తరుణ్ దిల్లాన్, రాకేశ్ కుమార్, శ్యామ్ సుందర్, వివేక్ చికారా, హర్విందర్ సింగ్, జ్యోతి బలియాన్ పతకాలు సాధించుకొని వస్తారని భావిస్తున్నారు.
Also Read: Ever Given: అతి పెద్ద వాణిజ్య నౌక ‘ఎవర్ గీవెన్’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్