Suryapet Accident: క్రీడా మైదానాల్లో అదే నిర్లక్ష్యం.. గతంలో ఇలాంటి ఉదంతాలెన్నో..! అయినా మారని తీరు

|

Mar 23, 2021 | 1:41 PM

గతంలో మన దేశంలో క్రికెట్ స్టేడియంలతోపాటు క్రీడా మైదానాలలో జరిగిన ప్రమాదాలు, ఉదంతాల వివరాలను ఓ సారి పరిశీలిస్తే పలు సందర్భాలలో చిన్న పాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీసిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

Suryapet Accident: క్రీడా మైదానాల్లో అదే నిర్లక్ష్యం.. గతంలో ఇలాంటి ఉదంతాలెన్నో..! అయినా మారని తీరు
Accident
Follow us on

Suryapet Accident reminds human negligence:  క్రీడా మైదానాల్లో ప్రమాదాలు జరగడం పలు సందర్భాలలో మనం చూస్తూనే వున్నాం. తాజాగా సూర్యపేటలో మొదలైన కబడ్డీ టోర్నమెంటులో గ్యాలరీ కూలి వంద మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ క్రమంలో గతంలో మన దేశంలో క్రికెట్ స్టేడియంలతోపాటు క్రీడా మైదానాలలో జరిగిన ప్రమాదాలు, ఉదంతాల వివరాలను ఓ సారి పరిశీలిస్తే పలు సందర్భాలలో చిన్న పాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీసిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. తాజా ఉదంతం కూడా అదే కోవలోకి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్చి 22న సోమవారం సాయంత్రం 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. క్రీడాకారులు, తరలివచ్చిన జనాలు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలడంతో ప్రమాదం జరిగింది. 100 మందికి పైగా గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీలో సుమారు రెండు వేల మంది కూర్చున్నారు. సామర్థ్యానికి మించిన జనం గ్యాలరీలో కూర్చోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

2010 సెప్టెంబర్ నెలలో మొదలైన కామన్ వెల్త్ క్రీడల్లో కూడా ఇలాంటి ఉదంతమే జరిగింది. అయితే ఆనాడు స్టేడియంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. న్యూఢిల్లీలో కామన్ వెల్త్ క్రీడల కోసం నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన వెయిట్ లిఫ్టింగ్ విభాగం పైకప్పు కూలడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. 2016 జూలైలో నెల్లూరులో జన్నత్‌ ఇండోర్‌ స్టేడియం పైకప్పు కుప్ప కూలింది. నగరంలో అనేక మంది ప్రముఖులు నిత్యం బ్యాడ్మింటన్‌ ఆడే స్టేడియంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో స్టేడియంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

2019 ఏప్రిల్‌ నెలలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాదం సంభవించింది. ఫ్లడ్ లైట్లు బిగించిన ఒక భారీ టవర్ హఠాత్తుగా కూలిపోయింది. ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 2019 ఏప్రిల్‌ నెలలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రమాదం జరిగింది. సౌత్ పెవిలియన్ బైలాక్‌లోని షెడ్డు, భారీ ఎల్ఈడీ లైట్ కుప్పకూలింది. ఐపీఎల్‌ సీజనైనప్పటికీ ఆ సమయంలో మ్యాచ్‌ ఏదీ లేకపోవడంతో ప్రమాదం తప్పిపోయింది. భారీ జనసందోహం మధ్య జరిగిన ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగితే భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించేది. అయితే ఈ ప్రమాదానికి కారణం అంతకు ముందు కురిసిన భారీ వర్షమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో స్టేడియం పెవిలియన్ 80 శాతం దెబ్బతిన్నది.

2020 జనవరిలో కేరళలోని పాలక్కాడ్‌ పుట్‌బాల్‌ స్టేడియంలో ప్రమాదం సంభవించింది. అక్కడ కూడా గ్యాలరీ కుప్పకూలడంతో యాభై మందికి పైగా జనం గాయపడ్డారు. చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ.. జనం ఎక్కువ కావడంతో కూలిపోయింది. 2020 ఫిబ్రవరి… అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో (మొన్ననే ఈ స్టేడియంకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టారు) వెల్ కమ్ గేట్ కూలిపోయింది. గేటు పడిపోయే సమయంలో అక్కడ జనం లేకపోవడంతో ప్రమాదం తప్పింది.