బాలీవుడ్ సూపర్‌స్టార్‌గా కొనసాగడమే కాదు.. కరోనా మహమ్మారిని సైతం గెలిచిన యోధుడు అమితాబ్ బచ్చన్. ఇటీవల కరోనా సోకడంతో ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికొచ్చిన సందర్భంగా బిగ్ బీ గుర్తుండిపోయే పనిచేశారు. ఇంటి ఆవరణలో కొన్ని దశాబ్దాల కిందట నాటిన చెట్టు ఇటీవల నేలకొరడంతో… ఆ ప్రాంతంలో మరో మొక్కను నాటారు. పడిపోయిన చెట్టు.. కొత్తగా నాటిన చెట్టుతో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టారు బిగ్ బీ.
‘ఈ భారీ ‘గుల్‌మోహర్’ చెట్టును 1976లో నా ఇల్లు ‘ప్రతీష్ట’లో స్వయంగా నేనే స్వయంగా నాటాను. కానీ ఇటీవల ముంబైలో కురుసిన భారీ వర్షాలకు ఈ చెట్టు నేలకొరిగింది. ఆగస్టు 12న మా అమ్మగారి పుట్టిన రోజు పురస్కరించుకొని చెట్టు పడిపోయిన స్థానంలోనే మా అమ్మ తేజి బచ్చన్ పేరుతో మరో కొత్త ‘గుల్‌మోహర్’ మొక్కను నాటాను’’అని అమితాబ్ సోషల్‌మీడియాలో రాసుకొచ్చారు.