PT Usha : పీటీ ఉష కుటుంబంలో విషాదం..ఫోన్ చేసి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

PT Usha : భారత క్రీడా దిగ్గజం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ (67) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పీటీ ఉషకు ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

PT Usha : పీటీ ఉష కుటుంబంలో విషాదం..ఫోన్ చేసి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
Pt Usha

Updated on: Jan 30, 2026 | 9:40 AM

PT Usha : భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష భర్త వి.శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున తన నివాసంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. వైద్యులు పరీక్షించి ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. గత కొంతకాలంగా ఆయన వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసన్ మృతితో కేరళలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.

కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అయిన శ్రీనివాసన్, పీటీ ఉష క్రీడా జీవితంలోనే కాకుండా ఆమె రాజకీయ ప్రస్థానంలోనూ వెన్నెముకగా నిలిచారు. ఉష సాధించిన ఎన్నో అంతర్జాతీయ పతకాల వెనుక ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆమె పరుగుల రాణిగా ఎదిగే క్రమంలో ప్రతి అడుగులోనూ ఆయన తోడుగా ఉండేవారు. క్రీడా ప్రపంచంలో ఆయనను పీటీ ఉషకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అని పిలుచుకుంటారు. ఈ దంపతులకు ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నాడు.

శ్రీనివాసన్ మరణ వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పీటీ ఉషకు ఫోన్ చేసి ఆమెను పరామర్శించారు. కష్టకాలంలో ఆమెకు, ఆమె కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ప్రధాని తన సానుభూతిని వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో ఆమె సేవలకు శ్రీనివాసన్ అందించిన సహకారాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి, పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఆయన మృతికి నివాళులర్పించారు.

శ్రీనివాసన్ కేవలం ఒక భర్తగానే కాకుండా, ఉష అకాడమీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. భావి క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఉషమ్మకు ఆయన ఎంతో సహాయపడేవారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు క్రీడాకారులు, రాజకీయ నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఒక నిశ్శబ్ద శ్రామికుడిలా ఉషమ్మ విజయంలో భాగస్వామి అయిన శ్రీనివాసన్ మరణం క్రీడా లోకానికి తీరని లోటని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..