Pro Wrestling League: ప్రో రెజ్లింగ్ లీగ్–2026తో ఒలింపిక్ స్థాయి పోరాటాలకు వేదిక

భారత రెజ్లింగ్‌కు కొత్త దిశ చూపే ప్రో రెజ్లింగ్ లీగ్–2026 సాగుతోంది. ఒలింపిక్ స్థాయి రెజ్లర్లను ప్రొఫెషనల్ వేదికపైకి తీసుకొచ్చే ఈ లీగ్ జనవరి 15న నోయిడాలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది. అఖాడాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు రెజ్లర్లకు స్థిరమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా PWL ముందుకు సాగుతోంది.

Pro Wrestling League: ప్రో రెజ్లింగ్ లీగ్–2026తో ఒలింపిక్ స్థాయి పోరాటాలకు వేదిక
Pro Wrestling League

Updated on: Jan 24, 2026 | 9:39 PM

భారత రెజ్లింగ్‌కు మరో కీలక మైలురాయి. ఒలింపిక్ స్థాయి రెజ్లింగ్‌ను ప్రొఫెషనల్‌ స్పోర్ట్‌గా మరింత బలపరిచే లక్ష్యంతో ప్రో రెజ్లింగ్ లీగ్ (PWL)–2026 రసవత్తరంగా సాగుతోంది. దేశీయ రెజ్లర్లతో పాటు అంతర్జాతీయ అథ్లెట్లను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ లీగ్‌… రెజ్లింగ్‌కు కొత్త గుర్తింపు తీసుకొస్తుంది. అథ్లెట్‌ను కేంద్రంగా చేసుకుని రూపొందించిన దీర్ఘకాలిక వ్యవస్థే PWL ప్రత్యేకత. సంప్రదాయ అఖాడాల నుంచి వెలువడే యువ రెజ్లర్లకు స్థిరమైన పోటీ వాతావరణం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం. వ్యక్తిగతంగా పోటీ పడే రెజ్లింగ్‌ను జట్టు ఆధారిత ఫార్మాట్‌లో మార్చి, అభిమానులకు మరింత ఆసక్తికరంగా మార్చడం మరో లక్ష్యం.

రెజ్లర్లకు ప్రొఫెషనల్ వేదిక

PWL ద్వారా రెజ్లర్లకు క్రమబద్ధమైన ప్రొఫెషనల్ పోటీలు, మీడియా ఎక్స్‌పోజర్, కెరీర్‌కు భరోసా లభిస్తుంది. గ్రామీణ అఖాడాల నుంచి జాతీయ జట్టుకు, అక్కడి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఒక స్పష్టమైన మార్గాన్ని ఈ లీగ్ చూపిస్తోంది. దీంతో యువ రెజ్లర్లు ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు

PWL–2026ను జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు వీక్షించేలా సోనీ లివ్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony TEN 4, Sony TEN 5)లో ఈ లీగ్ ప్రత్యక్ష ప్రసారం అవుతోంది  టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కావడం ద్వారా రెజ్లింగ్‌ అన్ని వర్గాలకు చేరువ అవుతుంది.

జీవ వైవిధ్యం కాదు.. క్రీడా వైవిధ్యం

ఇప్పటివరకు కొద్ది ఈవెంట్లకే పరిమితమైన రెజ్లింగ్‌ను ప్రధాన స్పెక్టేటర్ స్పోర్ట్‌గా తీర్చిదిద్దాలన్నదే PWL ఆశయం. విభిన్న దేశాల అథ్లెట్లు పాల్గొనడం వల్ల పోటీలో వైవిధ్యం పెరిగి, భారత రెజ్లర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని చేధించే సౌలభ్యం ఉంటుంది. అదే సమయంలో అభిమానులకు ప్రపంచ స్థాయి రెజ్లింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది.

భవిష్యత్తుకు బాటలు

PWL–2026 భారత రెజ్లింగ్ భవిష్యత్తును కొత్త దిశలో నడిపించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అఖాడాల సంప్రదాయం, ప్రొఫెషనల్ లీగ్ వ్యవస్థ కలయికతో రెజ్లింగ్‌కు స్థిరత్వం, గౌరవం, గ్లోబల్ గుర్తింపు దక్కుతుందనే ఆశాభావం రెజ్లింగ్ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.