PKL 2024: తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి.. కెప్టెన్‌ అర్జున్‌ జోరుతో జైపూర్‌‌ భారీ విజయం

|

Oct 22, 2024 | 9:23 PM

Pro Kabaddi League 2024: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్‌ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్‌‌ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌‌ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది.

PKL 2024: తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి.. కెప్టెన్‌ అర్జున్‌ జోరుతో జైపూర్‌‌ భారీ విజయం
Telugu Titans Lost To Jaipur Pink Panthers
Follow us on

హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్‌ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్‌‌ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌‌ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. జైపూర్ జట్టులో అర్జున్ తో పాటు అభిజీత్ మాలిక్ (8) కూడా ఆకట్టుకున్నాడు. ఆతిథ్య టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజయ్ మాలిక్‌ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్‌ నాలుగుసార్లు ఆలౌటైంది.

ఇరు జట్ల మధ్య ఆరంభం నుంచి ఆట హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగం మొదటి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ మెప్పించగా.. చివరి పది నిమిషాల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పైచేయా సాధించింది. తన తొలి రైడ్‌లోనే టచ్‌ పాయింట్‌తో కెప్టెన్ పవన్ సెహ్రావత్‌ తెలుగు టైటాన్స్‌ ఖాతా తెరిచాడు. ఆ వెంటనే అర్జున్ దేశ్వాల్ జైపూ‌‌ర్‌‌కు తొలి పాయింట్ అందించాడు. రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లాయి. 6–6తో స్కోరు సమంగా నిలిచిన దశలో అర్జున్‌ను ట్యాకిల్ చేసిన టైటాన్స్‌.. పవన్‌ వరుస రైడ్ పాయింట్లతో 9–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో పవన్‌ను ఔట్ చేయడంతో పాటు వరుసగా మూడు పాయింట్లు రాబట్టిన జైపూర్‌‌ 9–9తో స్కోరు సమం చేసింది. అయితే, 18వ నిమిషంలో జైపూర్‌‌ అభిజీత్ చేసిన సూపర్ రైడ్‌ ఆటను మలుపు తిప్పింది. బోనస్‌తో పాటు అంకిత్‌, పవన్‌, క్రిషన్‌లను ఔట్ చేసిన అభిజీత్‌ ఏకంగా నాలుగు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అర్జున్‌ కోర్టులో మిగిలిన ఇద్దరు డిఫెండర్ల పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో టైటాన్స్‌ను తొలిసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్‌ 18–13తో ఐదు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

Telugu Titans Lost To Jaipur Pink Panthers

రెండో భాగంలో జైపూర్‌‌ విజృంభించగా.. తెలుగు జట్టూ పూర్తిగా డీలా పడింది. విరామం తర్వాత అర్జున్‌ జైపూర్‌‌కు మరో రైడ్ పాయింట్ అందించగా, విజయ్ మాలిక్‌ జైపూర్ ఆటగాడు రెజాను టచ్‌ చేసి వచ్చాడు. కానీ, తన తర్వాతి రైడ్‌లో అర్జున్‌.. విజయ్‌, సాగర్‌‌ను ఔట్‌ చేసి జట్టుకు మరో రెండు పాయింట్లు తెచ్చి పెట్టడంతో జైపూర్‌‌ తన ఆధిక్యాన్ని 21–14కి పెంచుకుంది. ఆపై ఇరు జట్ల డూ ఆర్ డై రైడ్స్‌లో ఇటు పవన్‌, అటు అర్జున్‌ సక్సెస్‌ అయ్యారు.ఈ క్రమంలో అర్జున్‌ సూపర్‌‌ టెన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కెప్టెన్లు వరుస రైడ్స్‌ చేయగా.. ఇందులో అర్జున్ పైచేయి సాధించాడు. అర్జున్ వరుసగా రెండు డబుల్‌ రైడ్స్‌తో సత్తా చాటగా.. పవన్‌ను అంకుష్‌ ట్యాకిల్ చేశాడు. విజయ్ మాలిక్‌ను కూడా ట్యాకిల్ చేసిన పింక్ పాంథర్స్ జట్టు టైటాన్స్‌ను రెండోసారి ఆలౌట్‌ చేసి 31–17తో విజయం ఖాయం చేసుకుంది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ మరింత నిరాశ పరిచింది. సెహ్రావత్ సహా రైడర్లు ప్రత్యర్థికి దొరికిపోగా.. డిఫెండర్లు సైతం చేతులెత్తేశారు. దాంతో మరో రెండుసార్లు ఆలౌటైన తెలుగు జట్టు 21–49తో వెనుకబడింది. మరోవైపు అర్జున్‌ సూపర్ రైడింగ్‌తో జైపూర్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Telugu Titans Lost To Jaipur Pink Panthers