టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, యువ కెరటం మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి లవ్ ట్రాక్‌కు పెద్దలు కూడా యస్ చెప్పడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
సౌత్ సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా సుపరిచితమే. ముంబైకు చెందిన ఈ 26 ఏళ్ల ముద్దుగుమ్మ.. తుళు భాషలో ‘ తెళికెడా బొల్లి’ సినిమాతో 2012లో వెండితెరకు పరిచయమైంది. ‘ఓరు కన్నియుమ్ మూను కలవానికాలమ్’ , ‘ఉదయం ఎన్‌హెచ్ 4’ లాంటి సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ‘ఇంద్రజిత్’ మూవీలోనూ నటనతో మెస్మరైజ్ చేసింది. తాజాగా ఆర్. పన్నీర్ సెల్వం దర్శకత్వంలో రాబోయే ‘నాన్ దా శివ’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మనీశ్ పాండే పెళ్లి అతికొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో రెండు రోజులు పాటు జరగనుందని తెలుస్తోంది.
పాండే పెళ్లి సమయంలో భారత క్రికెట్ జట్టు-వెస్టిండిస్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ ముంబైలో జరగనుంది. దీంతో టీమిండియా క్రికెటర్లు అతడి పెళ్లికి హాజరవ్వనున్నారు. ప్రస్తుతం మనీశ్ పాండే విజయ్ హాజారే ట్రోఫీ 2019-20 సీజన్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే!. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా మనీశ్ రికార్డు నెలకొల్పాడు.
అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన మనీశ్ పాండే తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో పాండే సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.అయితే, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన మనీశ్ పాండే జట్టులో చోటు దక్కించుకున్నా… రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.