India Cricket : అక్కడ విజయం టీమిండియాకు అందని ద్రాక్షే.. మనోళ్లను వెక్కిరిస్తున్న ఐదు గ్రౌండ్స్

భారత టెస్ట్ జట్టు ఎప్పుడూ గెలవని ఐదు అంతర్జాతీయ టెస్ట్ వేదికల గురించి తెలుసుకుందాం. ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్సింగ్‌టన్ ఓవల్, కరాచీ, లాహోర్‌లలో భారత్ ఇంత వరకు టెస్ట్ మ్యాచులు గెలిచింది లేదు. ఎందుకు ఇక్కడ విజయం దక్కలేదో వివరంగా చూద్దాం.

India Cricket : అక్కడ విజయం టీమిండియాకు అందని ద్రాక్షే.. మనోళ్లను వెక్కిరిస్తున్న ఐదు గ్రౌండ్స్
Kensington Oval

Updated on: Jul 03, 2025 | 6:13 PM

India Cricket : ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2న ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ లో మొదలైంది. ఈ గ్రౌండ్‌లో భారత్ టెస్ట్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. వాస్తవానికి ఈ చారిత్రక గ్రౌండ్‌లో భారత్ ఇంతవరకు ఎప్పుడూ టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ ఒక్కటే కాదు.. భారత జట్టుకు గెలవడం కష్టమైన కొన్ని స్టేడియాలు ఉన్నాయి. భారత్ కనీసం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, ఒక్కసారి కూడా గెలవని ఐదు ఇంటర్నేషనల్ టెస్ట్ వేదికల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ (ఇంగ్లండ్)
ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ భారత జట్టుకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలులాంటిది. అక్కడ భారత్ గెలవడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ భారత్ 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ గ్రౌండ్‌లో గెలవడం ఇప్పటికీ భారత జట్టుకు ఒక కలగానే మిగిలిపోయింది.

2. ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్)
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టు కష్టాలు అందరికీ తెలిసినవే. 1967లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కెప్టెన్సీలో ఇక్కడ మొదటి మ్యాచ్ ఆడినప్పటి నుంచి భారత్ 8 టెస్టులు ఆడింది. వాటిలో 7 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో మాత్రమే డ్రా అయింది. అంటే, భారత్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ గ్రౌండ్ ఇంగ్లండ్‌కు ఒక కోటలా మారిపోతుంది.

3. కెన్సింగ్‌టన్ ఓవల్, బార్బడోస్ (వెస్టిండీస్)
వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో ఉన్న అందమైన కెన్సింగ్‌టన్ ఓవల్‌లో కూడా భారత్ టెస్ట్ మ్యాచ్ లో గెలుపును చూడలేదు. ఇప్పటివరకు ఇక్కడ భారత్ 9 మ్యాచ్‌లు ఆడింది. కొన్ని మ్యాచ్‌లు చాలా దగ్గరగా వచ్చినా ఈ కరేబియన్ గ్రౌండ్‌లో మాత్రం భారత్ గెలవలేకపోయింది.

4. నేషనల్ స్టేడియం, కరాచీ (పాకిస్తాన్)
ఇటీవలి సంవత్సరాల్లో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. కానీ గతంలో కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఏ ఒక్కటి కూడా గెలవలేకపోయింది.

5. గద్దాఫీ స్టేడియం, లాహోర్ (పాకిస్తాన్)
ఈ జాబితాలో మరో పాకిస్తాన్ వేదిక లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియం. ఇక్కడ భారత్ ఏడు టెస్టులు ఆడింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా గెలిచిన చరిత్ర టీంఇండియాకు లేదు. గతంలో కొన్ని మంచి మ్యాచ్‌లు ఆడినప్పటికీ విజయం మాత్రం దక్కలేదు.

ఈ ఐదు గ్రౌండ్‌లు టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు ఎప్పుడూ గట్టి సవాలునే విసిరాయి. భవిష్యత్తులో ఈ రికార్డులు ఏమైనా మారతాయో లేదో చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..