భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. ఆసిస్ జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కట్టడి చేశారు. ఆస్ట్రేలియా జట్టు పతనాన్ని ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే బుమ్రా ప్రారంభించాడు. ఓపెనర్ జో బర్న్స్ ఔట్ చేసి మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. నాలుగో వికెట్‌ను బుమ్రా తీయగా… అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సిరాజ్ తన మొదటి వికెట్‌గా లబుషేన్(48)ను ఔట్ చేశాడు. దీంతో ఆసిస్ 134 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు మరింత విజృంభించారు. వరుస స్పెల్స్‌లో వికెట్లు తీశారు. దీంతో ఆసిస్ 61 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో బుమ్రాకు 4, రవిచంద్రన్ అశ్విన్‌కు 3, మహ్మద్ సిరాజ్‌కు 2, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ లభించాయి.