India Vs Australia 2020: టీమిండియా ఆఖరి పోరు.. పొంచి ఉన్న వాన గండం.. ఆసీస్‌కు ఘన రికార్డు..

|

Jan 14, 2021 | 4:53 PM

India Vs Australia 2020: భారత్-ఆస్ట్రేలియా సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. రేపటి నుంచి టీమిండియా గబ్బా వేదికగా ఆసీస్‌తో ఆఖరి పోరుకు సిద్దమైంది.

India Vs Australia 2020: టీమిండియా ఆఖరి పోరు.. పొంచి ఉన్న వాన గండం.. ఆసీస్‌కు ఘన రికార్డు..
India Vs Australia
Follow us on

India Vs Australia 2020: భారత్-ఆస్ట్రేలియా సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. రేపటి నుంచి టీమిండియా గబ్బా వేదికగా ఆసీస్‌తో ఆఖరి పోరుకు సిద్దమైంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గత మ్యాచ్ ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఒక వైపు… గాయాల బెడద మరో వైపు.. ఈ రెండింటి మధ్య టీమిండియా సతమతమవుతుంటే.. గబ్బాలో తమ గత రికార్డులకు అనుగుణంగా ఈసారి కూడా తమదే పైచేయి అవుతుందని ఆసీస్ జట్టు ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆటగాళ్ల గాయాలు టీమిండియాను వేధిస్తున్నాయి. ఫిట్‌గా ఉన్న 11 మంది ప్లేయర్స్ కోసం జట్టు యాజమాన్యం తంటాలు పడుతోంది. కొత్తగా సాహా, శార్దూల్/నటరాజన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ మూడో టెస్టులో మంచి ఆరంభం ఇవ్వడం.. గత జోడీలు ఎవరూ కూడా చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో విఫలం కావడంతో ఈ నాలుగో టెస్టుతో పాటు స్వదేశంలో కూడా రోహిత్, గిల్ స్పెషలిస్ట్ ఓపెనింగ్ పెయిర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఆస్ట్రేలియాకు గబ్బాలో ఘనమైన రికార్డు ఉంది. అక్కడ ఆడిన 62 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. ఈ మైదానంలో లియాన్ ఒక్కడే 35 వికెట్లు పడగొట్టగా.. పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హెజిల్‌వుడ్ కలిపి 74 వికెట్లు తీశారు. చివరిగా ఆడిన రెండు టెస్టుల్లోనూ కంగారూలు ఇన్నింగ్స్ విజయాలు సాధించారు. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్లు లబూషేన్, స్మిత్ సూపర్ ఫామ్‌లో ఉండటం వారికి సానుకూలంశం. అటు బౌలింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. దీనితో భారత్ జట్టు మరో సవాల్ ఎదుర్కోవడం ఖచ్చితంగా కనిపిస్తోంది. కాగా, ఈ నాలుగో టెస్టుకు వానగండం పొంచి ఉంది. ఆదివారం, సోమవారం వాన పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అయితే దాని వల్ల మొత్తం రోజంతా ఆట తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదు.