Duleep Trophy 2010: క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఎన్నేళ్లు గడిచినా ఆ సంచలనాలు అలాగే గుర్తుండిపోతాయి. భవిష్యత్తు తరాలు ఆ క్రికెట్ మ్యాచ్‌ల గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటారు. అలాంటి వాటిలో 2010లో జరిగిన దులిప్ ట్రోఫీ ఒకటి. ఈ మ్యాచ్ జరిగి పదేళ్లు గడుస్తోన్న సందర్భంగా అప్పటి విశేషాలను ఓసారి గుర్తుచేసుకుందాం.
2010లో దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులిప్ ట్రోఫీలో భాగంగా సౌత్ జోన్, వెస్ట్ జోన్‌ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ఎన్నో సంచలనాలను కేరాఫ్‌గా నిలిచింది. ఈ ట్రోఫీలో భాగంగా చివరి మ్యాచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా బ్యాటింగ్ మొదలుపెట్టిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకే అలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్‌లో యూసుఫ్ పఠాన్ 108 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 9 వికెట్లు కోల్పోయి 386 పరుగులకు డిక్లేర్ చేసింది.
536 పరగులు భారీ లక్ష్య ఛేదనతో మ్యాచ్ ప్రారంభించిన వెస్ట్ జోన్ ప్రత్యర్థి జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాచ్ ప్రారంభంలో చిరాగ్ పాథక్, హర్షద్ ఖాదీవాలే శుభారంభం చేశారు. ఈ మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ తన అసమాన బ్యాటింగ్‌తో ఏకంగా 190 బంతుల్లో 210 పరుగులు చేసిన రికార్డు సృష్టించాడు. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని సాధించిన మ్యాచ్‌గా అరుదైన ఘనత సాధించింది. ఇక ఎన్నో అద్భుతాలకు నెలవైన ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు సెంచరీలు నమోదు కావడం మరో విశేషం.