ఐపీఎల్ – 15 వ సీజన్ లో ఇవాళ(శుక్రవారం) రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) మధ్య జరిగే మ్యాచ్ పై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) ఆసక్తికర కామెంట్లు చేశారు. రాజస్థాన్‌ను ఓడించాలంటే తమ జట్టు శక్తి సామర్థ్యాలను నమ్ముకోవాలని అన్నారు. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్వాలిఫయర్ మ్యాచ్‌ను సాధారణ మ్యాచ్‌లా తీసుకుని ఆడితే ఒత్తిడికి గురి కాకుండా ఉండవచ్చని సూచించారు. అంతే కాకుండా లీగ్ స్టేజ్‌లో టాప్-2లో చోటు దక్కించుకోకుంటే ఫైనల్ చేరడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. మెగా టోర్నీ రెండు నెలలకుపైగా సాగడంతో ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తాము ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే విషయం తమ చేతుల్లో లేదని, దిల్లీ క్యాపిటల్స్ పై ముంబయి గెలవడంతో తమకు అవకాశం వచ్చిందని వెల్లడించారు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచి, ఫైనల్లో గుజరాత్‌తో పోటీ పడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
లీగ్ స్టేజ్‌లో వాంఖడే వేదికగా ముంబయి, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను కచ్చితంగా ఆస్వాదించాల్సిన విషయం. ఎందుకంటే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే విషయం మా చేతుల్లో లేదు. ముంబయి గెలవడంతో మాకు అవకాశం వచ్చింది. అందుకే సెలబ్రేట్ చేసుకున్నాం. లఖ్‌నవూతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తేలికపాటి జల్లుల వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. ఆరోజు రాత్రి ఆటగాళ్లలో చాలా మందికి తగినంత నిద్రలేదు.
– ఫాఫ్ డుప్లెసిస్, ఆర్సీబీ కెప్టెన్