
AUS vs ZIM: ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై జింబాబ్వే జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో ర్యాన్ బర్లే కీలక పాత్ర పోషించాడు. మరి ప్రపంచ ఛాంపియన్ జట్టును ఓడిస్తే సంబరాలు మామూలుగా ఉంటాయా? అందుకే జింబాబ్వే ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం మైదానంలో తెగ హడావుడి చేశారు. ఆతర్వాత తిరుగు ప్రయాణంలో బస్సులో అంతకుమించి సంబరాలు జరుపుకున్నారు. బస్సులోనే డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందంలో మునిగితేలారు. దీనికి సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఇది ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
ప్రస్తుతం జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో జింబాబ్వే ఓడిపోయింది. అయితే మూడో వన్డేలో మాత్రం జూలు విదిల్చింది. దెబ్బతిన్న పులిలా కంగారులపై విరుచుకుపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 141 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఏడు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్‌లో జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ అయిదు వికెట్లతో ఆసీస్ బ్యాటర్లను కంగారు పెట్టించాడు. కేవలం 3 ఓవర్లు వేసిన అతను 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..