Wriddhiman Saha: ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరైన వృద్ధిమాన్ సాహా ఇకపై టీమ్ ఇండియా తరఫున ఆడే అవకాశం కనిపించకపోవచ్చు. దాదాపు వృద్ధిమాన్ సాహా టెస్ట్ కెరీర్ ముగిసినట్లే. టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కూడా భవిష్యత్‌లో అవకాశం ఇవ్వమని దాదాపు అతడికి చెప్పేసింది. మార్చి 4 నుంచి మొహాలీలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. రిషబ్ పంత్ జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇష్టమైన వికెట్ కీపర్. న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెఎస్ భరత్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులో చేరనున్నాడు.
సాహా రంజీ ట్రోఫీ కూడా ఆడడు..
వృద్ధిమాన్ సాహా రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. BCCI వర్గాల ప్రకారం.. వృద్ధిమాన్ వ్యక్తిగత కారణాల వల్ల రంజీ ట్రోఫీ ఆడబోనని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా, జాయింట్ సెక్రటరీ స్నేహాశిష్ గంగూలీకి తెలియజేసాడు. ఈ కారణంగానే సెలక్టర్లు (సీఏబీ) అతడిని ఎంపిక చేయలేదు. భారత్ తరఫున 40 టెస్టులాడిన సాహా మూడు సెంచరీల సాయంతో 1353 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 30 కంటే తక్కువగా ఉంది. అయితే అతను 92 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లతో సహా వికెట్ వెనుక 104 వికెట్లు తీసుకున్నాడు.
ఇషాంత్ శర్మ కెరీర్ ప్రమాదంలో..
వృద్ధిమాన్ సాహాలాగే మరో సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ కూడా ప్రమాదంలో పడినట్లే. ఇషాంత్‌ని దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపిక చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మహ్మద్ సిరాజ్ ఇప్పుడు మూడో ఫాస్ట్ బౌలర్ పాత్రలో రాణిస్తున్నాడు. అదే సమయంలో ఉమేష్ యాదవ్ నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ కూడా మునుపటిలా లేదు. అందువల్ల శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఇతనికి అవకాశం లభిస్తుందా లేదా అనేది వేచిచూడాలి.