WPL 2026 Mega Auction: స్మృతి మంధాన రికార్డు బ్రేక్.. WPL వేలంలో డబ్బుల వర్షం కురిసే తోపు ప్లేయర్స్ వీళ్లే!

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ఈ నెల నవంబర్ 27న ఢిల్లీలో జరగనుంది. ఈ వేలంలో పలువురు దేశీయ, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫ్రాంచైజీలు తమ జట్లను పటిష్టం చేసుకోవడానికి ఈ స్టార్ ప్లేయర్లపై భారీగా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

WPL 2026 Mega Auction: స్మృతి మంధాన రికార్డు బ్రేక్.. WPL వేలంలో డబ్బుల వర్షం కురిసే తోపు ప్లేయర్స్ వీళ్లే!
Wpl 2026 Auction

Updated on: Nov 25, 2025 | 9:43 AM

WPL 2026 Mega Auction: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ఈ నెల నవంబర్ 27న ఢిల్లీలో జరగనుంది. ఈ వేలంలో పలువురు దేశీయ, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫ్రాంచైజీలు తమ జట్లను పటిష్టం చేసుకోవడానికి ఈ స్టార్ ప్లేయర్లపై భారీగా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మెగా ఆక్షన్ కోసం మొత్తం 277 మంది క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 194 మంది భారతీయులు కాగా, 83 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

డబ్ల్యూపీఎల్ చరిత్రలో ప్రస్తుతం అత్యధిక ధర పలికిన క్రీడాకారిణిగా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు) రికార్డు సృష్టించింది. అయితే ఈసారి జరగబోయే వేలంలో ఆమె రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు లెక్కకు మించిన డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది.

ఈ WPL వేలంలో అత్యధిక ధర పలికే రేసులో పలువురు అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు:

దీప్తి శర్మ (భారత్): మహిళల వరల్డ్ కప్ 2025లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. ఆమె ఆల్-రౌండర్ సామర్థ్యం కారణంగా దీప్తిపై భారీగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది.

రేణుకా సింగ్ (భారత్): తన స్వింగ్‌తో పవర్‌ప్లేలోనే వికెట్లు తీయగలిగే సామర్థ్యం ఉన్న ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌కు కూడా ఫ్రాంచైజీల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది.

సోఫీ ఎక్లెస్టన్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండ్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తన కచ్చితమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతుంది. అందుకే ఆమెపై ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాలని భావిస్తున్నాయి.

ఎలిస్సా హీలీ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా కెప్టెన్, వికెట్ కీపర్ అయిన ఈ స్టార్ ప్లేయర్‌కు వేలంలో మంచి ధర దక్కడం ఖాయం.

అమేలియా కెర్ (న్యూజిలాండ్), లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా): ఈ ఐదుగురితో పాటు న్యూజిలాండ్‌కు చెందిన ఆల్-రౌండర్ అమేలియా కెర్, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్‌లపై కూడా ఫ్రాంచైజీలు భారీ పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

డబ్ల్యూపీఎల్ మెగా ఆక్షన్ ముఖ్యాంశాలు

డబ్ల్యూపీఎల్ 2026 అనేది రెండో మెగా ఆక్షన్. గతంలో 2023లో మొదటి వేలం జరిగింది. ఈ వేలంలో ఆటగాళ్లకు వారి కెపాసిటీ ఆధారంగా బేస్ ధరలను నిర్ణయించారు. అత్యధికంగా 50 లక్షల రూపాయల బేస్ ధర విభాగంలో 19 మంది, 40 లక్షల విభాగంలో 11 మంది, 30 లక్షల విభాగంలో 88 మంది ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన వారు 20 లక్షలు, 10 లక్షల బ్రాకెట్‌లో ఉన్నారు.

మొదటిసారి RTM కార్డ్ వాడకం

ఈ మెగా వేలంలో మొదటిసారిగా రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌లను ఉపయోగించనున్నారు. దీని ద్వారా ఒక జట్టు తమ పాత ఆటగాడిని, వేలంలో వేరే ఫ్రాంచైజీ ఎంత ధర పెట్టినా, అదే ధరకు తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రాంచైజీలకు తమ కోర్ టీమ్‌ను కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.