
Will KKR Get Refund Of Rs 9.20 Crore to Mustafizur Rahman: ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ (BCCI) అకస్మాత్తుగా ఆదేశించడంతో, ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు KKR విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తీవ్రంగా పోటీ పడి మరి దక్కించుకున్న ఈ స్టార్ బంగ్లాదేశ్ పేసర్, కొత్త సీజన్‌లో ఒక్క బంతి కూడా వేయకముందే జట్టుకు దూరం కానున్నాడు.
సాధారణంగా ఐపీఎల్ వేలం నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత ఆ ఫ్రాంచైజీ పర్సు (Purse) లోని నిధులు “లాక్” చేయబడతాయి. కానీ, ముస్తాఫిజుర్ కేసు భిన్నమైనది. ఇది ఆటగాడి స్వయకృత నిర్ణయం లేదా గాయం వల్ల జరిగిన మార్పు కాదు, దౌత్య, భద్రతా పరమైన కారణాల వల్ల బీసీసీఐ స్వయంగా ఆదేశించడంతో విడుదల చేశారు.
లీగ్ నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం, క్రికెటేతర కారణాల వల్ల బీసీసీఐ అధికారికంగా ఒక ఆటగాడిని జట్టు నుంచి ఉపసంహరించుకుంటే, ఆ ఆటగాడి వేలం ధరను ఫ్రాంచైజీ నిధుల పూల్‌కు తిరిగి జమ చేస్తారు. కాబట్టి, KKR కి ఆ రూ. 9.20 కోట్లు తిరిగి లభించే అవకాశం ఉంది.
ముస్తాఫిజుర్ పరిస్థితి ‘ఫోర్స్ మేజ్యూర్’ కిందకు వస్తుంది. ఇది ఒక ఒప్పంద నిబంధన, దీని ప్రకారం అదుపులో లేని అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఒప్పంద బాధ్యతల నుంచి మినహాయింపు లభిస్తుంది. బీసీసీఐ ఆదేశాల మేరకే ముస్తాఫిజుర్ తప్పుకుంటున్నందున, అతని పట్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం నైట్ రైడర్స్ యాజమాన్యానికి ఉండదు. అయితే, ముస్తాఫిజుర్ నష్టపరిహారం కోరితే పరిస్థితి ఎలా మారుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ “రీఫండ్” KKR కి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నిధులతో వారు ‘రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్’ (RAPP) నుంచి మరొక ఆటగాడిని కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఈ డబ్బు తిరిగి రాకపోతే, తమ ప్రమేయం లేని తప్పుకు KKR నష్టపోవాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ రీప్లేస్ మెంట్ వచ్చేశాడ్రోయ్.. 83 సగటుతో బడితపూజే..
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, KKR కి రీప్లేస్‌మెంట్ తీసుకునే అవకాశం కల్పిస్తామని ధృవీకరించాడు. అయితే, నిధుల వాపసు ప్రక్రియ ఎప్పుడు, ఎలా జరుగుతుందనేది స్పష్టం చేయలేదు.
దాదాపుగా KKR వద్ద కొత్త విదేశీ సీమర్ కోసం ఖర్చు చేయడానికి రూ. 9.20 కోట్లు సిద్ధంగా ఉంటాయి. అయితే, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన ముస్తాఫిజుర్ వంటి నాణ్యమైన ఆటగాడిని వెతకడం ఇప్పుడు KKR కి ఒక సవాలుగా మారనుంది.