SriLanka Series : ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. నెలలోపే మైదానంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న కోహ్లీ, రోహిత్

బంగ్లాదేశ్ పర్యటన రద్దైన తర్వాత, భారత జట్టు ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్న ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. షెడ్యూల్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

SriLanka Series : ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. నెలలోపే మైదానంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న కోహ్లీ, రోహిత్
Team India (2)

Updated on: Jul 09, 2025 | 6:10 PM

SriLanka Series : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉండేది. అయితే, అంతర్జాతీయ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ పర్యటనను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసిన టీమిండియా వచ్చే నెల శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. ఇది నిజమైతే స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ బ్యాట్‌తో చెలరేగడాన్ని అభిమానులు చూడొచ్చు.

ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు వైట్ బాల్ సిరీస్ ఆడాల్సి ఉండేది. కానీ, బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల కారణంగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 2026 వరకు వాయిదా వేశారు. ఇప్పుడు భారత జట్టుకు ఆగస్టులో షెడ్యూల్ ఖాళీగా ఉండటంతో బీసీసీఐ వైట్ బాల్ సిరీస్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో, జూలై-ఆగస్టులో జరగాల్సిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. దీంతో శ్రీలంకకు కూడా ఆగస్టు షెడ్యూల్ ఖాళీగా ఉంది. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారత్-శ్రీలంక సిరీస్ ఎప్పుడు జరుగుతుంది?
భారత్-శ్రీలంక సిరీస్ తేదీలు అయితే ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఆగస్టు 29 నుంచి జింబాబ్వే పర్యటనకు శ్రీలంక వెళ్లాల్సి ఉన్నందున, ఆగస్టు మధ్యలో ఈ సిరీస్‌ను నిర్వహించవచ్చని అంచనా వేస్తున్నారు. భారత్, శ్రీలంక మధ్య చివరి సిరీస్ జులై 2024లో జరిగింది. అది భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ కు మొదటి పర్యటన కూడా. ఆ పర్యటనలో భారత జట్టు టీ20 సిరీస్‌ను గెలిచింది. అయితే శ్రీలంక వన్డే సిరీస్‌లో భారత్‌ను ఓడించింది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..