
Indian Cricketers Salary BCCI: బీసీసీఐ ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ అంటేనే కోట్లు కురిపించే వరం. అయితే అందరు ప్లేయర్లకు సమానంగా జీతాలు ఉండవు. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో సమానంగా భారీ వేతనం అందుకుంటున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలో తన యాన్యువల్ సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో కీలక మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ A+, గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C అనే నాలుగు విభాగాల్లో గ్రేడ్ A+ను పూర్తిగా తొలగించే దిశగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అడుగులు వేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, ఆటగాళ్లను కేవలం మూడు కేటగిరీలుగానే విభజిస్తారు. ప్రస్తుతం అత్యున్నత విభాగమైన గ్రేడ్ A+ లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్ల భారీ వేతనం లభిస్తోంది.
టీమిండియాలో స్టార్ హోదా కలిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గ్రేడ్ A+ లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరికి సమానంగా మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో అంటే రూ.7 కోట్ల జీతం అందుకుంటున్నారు. వారే టీమిండియా నమ్మదగ్గ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నందున బీసీసీఐ వీరిద్దరికీ కూడా రోహిత్, కోహ్లీలతో సమానంగా అత్యున్నత గ్రేడ్ ఇచ్చి గౌరవిస్తోంది.
ఇక టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా భావిస్తున్న శుభ్‌మన్ గిల్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గ్రేడ్ A లో ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున వేతనం అందుతోంది. టీ20 స్పెషలిస్ట్, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ B లో ఉండటంతో ఆయనకు సంవత్సరానికి రూ.3 కోట్లు లభిస్తున్నాయి. కాగా, రాబోయే కొత్త విధానంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జీతాలు నిర్ణయించాలని బోర్డు భావిస్తోంది. అదే జరిగితే కొందరి ఆటగాళ్ల ఆదాయంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..