AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar : పెళ్లి పీటల మీద నుంచి నేరుగా స్టేడియానికే.. అర్జున్ టెండూల్కర్ డెడికేషన్ చూస్తే షాకవ్వాల్సిందే

Arjun Tendulkar : సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లైన 24 గంటల లోపే అర్జున్ మైదానంలోకి దిగి తన క్రికెట్ పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు. డీవై పాటిల్ టీ20 కప్ 2026లో భాగంగా అర్జున్ డీవై పాటిల్ బ్లూ జట్టు తరఫున ఆడుతున్నాడు.

Arjun Tendulkar : పెళ్లి పీటల మీద నుంచి నేరుగా స్టేడియానికే.. అర్జున్ టెండూల్కర్ డెడికేషన్ చూస్తే షాకవ్వాల్సిందే
Arjun Tendulkar
Rakesh
|

Updated on: Mar 07, 2026 | 3:31 PM

Share

Arjun Tendulkar : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆట పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. పెళ్లి పీటల మీద నుంచి నేరుగా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టి తన తండ్రికి తగ్గ వారసుడినని నిరూపించుకున్నాడు. అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ వివాహం గురువారం (మార్చి 5) అత్యంత వైభవంగా జరిగింది. అయితే పెళ్లి ముగిసిన 24 గంటల లోపే అర్జున్ తన కిట్ బ్యాగ్ సర్దుకుని గ్రౌండ్‌లో వాలిపోయాడు. కేవలం పెళ్లి తర్వాతే కాదు, పెళ్ళికి ఒక్కరోజు ముందు కూడా అర్జున్ మ్యాచ్ ఆడటం విశేషం.

డీవై పాటిల్ టీ20 కప్ 2026లో భాగంగా అర్జున్ డీవై పాటిల్ బ్లూ జట్టు తరఫున ఆడుతున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే, అంటే శుక్రవారం (మార్చి 6) ముంబై కస్టమ్స్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్జున్ మైదానంలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో అర్జున్ జట్టుకు అదృష్టం కలిసిరాలేదు. 5 వికెట్ల తేడాతో డీవై పాటిల్ బ్లూ జట్టు ఓటమి పాలైంది. అర్జున్ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంది. బ్యాటింగ్‌లో 14 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసిన అర్జున్, బౌలింగ్‌లో ఒకే ఓవర్ వేసి ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, ఫలితంతో సంబంధం లేకుండా పెళ్లైన వెంటనే అతను ఆటకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అర్జున్ టెండూల్కర్ క్రికెట్ పిచ్చి మాములుగా లేదు. మార్చి 5న తన పెళ్లి పెట్టుకుని, మార్చి 4న ఇన్‌కమ్ టాక్స్ టీమ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నాడు. అంటే బుధవారం మ్యాచ్ ఆడి, గురువారం పెళ్లి చేసుకుని, మళ్ళీ శుక్రవారం సెమీఫైనల్ ఆడాడు. ఒక యువ క్రికెటర్‌కు ఉండాల్సిన పట్టుదల, క్రమశిక్షణ అర్జున్‌లో మెండుగా ఉన్నాయని క్రీడా పండితులు ప్రశంసిస్తున్నారు. “సలామ్ అర్జున్.. నీ జునూన్ చూస్తుంటే ముచ్చటగా ఉంది” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

కుమారుడి పెళ్లి సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. “అర్జున్, సానియా తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, మీరు కురిపిస్తున్న ప్రేమకు, ఆశీస్సులకు మేము రుణపడి ఉంటాం. మీ మెసేజులు, శుభాకాంక్షలు మా కుటుంబానికి, ముఖ్యంగా కొత్త దంపతులకు ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. అందరికీ ధన్యవాదాలు” అని సచిన్ రాసుకొచ్చారు.

ముంబైలో జరిగిన ఈ వివాహ వేడుకకు క్రికెట్ దిగ్గజాలతో పాటు, రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సచిన్ టెండూల్కర్ తనయుడిగా భారీ అంచనాల మధ్య కెరీర్ కొనసాగిస్తున్న అర్జున్, ప్రస్తుతం గోవా జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పెళ్లి వేడుక అతని జీవితంలో తీపి గుర్తుగా నిలిచిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us