WI vs AUS: అంపైర్‌ నిర్ణయాలపై విమర్శలు.. కట్‌చేస్తే.. విండీస్ కోచ్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ

ICC Code of Conduct: సామీ వ్యాఖ్యలకు మద్దతుగా వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ రోస్టన్ ఛేజ్ కూడా గళం విప్పాడు. అంపైర్లు తప్పులు చేసినప్పుడు వారికి కూడా జరిమానాలు విధించాలని ఐసీసీని కోరాడు. ఆటగాళ్లు తప్పులు చేస్తే శిక్షలు అనుభవిస్తారని, మరి అంపైర్లు తప్పులు చేస్తే ఎందుకు శిక్షించరు అని ప్రశ్నించాడు.

WI vs AUS: అంపైర్‌ నిర్ణయాలపై విమర్శలు.. కట్‌చేస్తే.. విండీస్ కోచ్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ
Daren Sammy

Updated on: Jun 29, 2025 | 12:49 PM

West Indies head Coach Daren Sammy Fined: వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను సామీని ఐసీసీ మందలించింది. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జతచేసింది.

అసలేం జరిగింది?

బార్బడోస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో డారెన్ సామీ థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్‌స్టాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ బ్యాటర్లు రోస్టన్ ఛేజ్, షై హోప్ అవుట్ అయిన విధానంపై సామీ సందేహాలు వ్యక్తం చేశాడు. అంపైరింగ్‌లో స్థిరత్వం లేదని, తమ జట్టుపై ఏదైనా పక్షపాతం ఉందా అని ప్రశ్నించాడు.

“మేం కొన్ని అంపైర్ నిర్ణయాలపై ఆందోళన చెందకూడదనుకుంటున్నాం. కానీ, వరుసగా కొన్ని నిర్ణయాలు చూసినప్పుడు, అవి ప్రశ్నలను లేవనెత్తుతుంది. మా జట్టుపై ఏదైనా వ్యతిరేకత ఉందా? అనేది సందేహం వస్తోంది” అని సామీ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్‌స్టాక్ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడని, ఇది తనకు ఇంగ్లండ్‌లోనే మొదలైందని సామీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన..

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.7ను సామీ ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ నిర్ధారించారు. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైర్లు, ఆటగాళ్లు లేదా టీమ్ అధికారులపై బహిరంగంగా విమర్శలు చేయడం లేదా అనుచిత వ్యాఖ్యలు చేయడం నిషేధిస్తుంది. సామీ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే జరిమానా విధించారు.

కెప్టెన్ ఛేజ్ కూడా..

సామీ వ్యాఖ్యలకు మద్దతుగా వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ రోస్టన్ ఛేజ్ కూడా గళం విప్పాడు. అంపైర్లు తప్పులు చేసినప్పుడు వారికి కూడా జరిమానాలు విధించాలని ఐసీసీని కోరాడు. ఆటగాళ్లు తప్పులు చేస్తే శిక్షలు అనుభవిస్తారని, మరి అంపైర్లు తప్పులు చేస్తే ఎందుకు శిక్షించరు అని ప్రశ్నించాడు. మ్యాచ్‌లో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా వెళ్లడం వల్ల ఆటపై తీవ్ర ప్రభావం పడిందని ఛేజ్ పేర్కొన్నాడు.

ఈ సంఘటన క్రికెట్ ప్రపంచంలో అంపైరింగ్ ప్రమాణాలు, వాటిపై ఆటగాళ్లు, కోచ్‌లు చేసే వ్యాఖ్యలపై మరోసారి చర్చకు దారితీసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..