Kieron Pollard Retirement: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు పొలార్డ్. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్, టీ20 లీగ్‌లు ఆడే విషయమై ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ముంబై ఇండియన్స్ (MI) ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా తన రిటైర్మెంట్‌పై ఒక వీడియో విడుదల చేసిన పొలార్డ్.. ‘నేను అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలామంది లాగే నేను 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాను. వెస్టిండీస్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కల కన్నాను. అందుకు తగ్గట్టుగానే సుమారు 15 ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టు తరఫున ఆడాను. కరేబియన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదలు తెలుపుతున్నాను. నా చిన్ననాటి హీరో బ్రియన్ లారా నాయకత్వంలో 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నా జీవితంలో ఇలాంటి ఎందరో దిగ్గజాలతో ఆడినందుకు నేనేంతో అదృష్టవంతుడిని ‘అని చెప్పుకొచ్చాడు.
ఫ్రాంఛైజీ క్రికెట్ పై నో క్లారిటీ..
కాగా ఇప్పటివరకు వెస్టిండీస్ జట్టుకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్ 2007లో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. కరేబియన్ జట్టు తరఫున 123 వన్డేలు,101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2,706 పరుగులతో పాటు 55 వికెట్లు తీశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 1,569 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ జట్టు 2012 టీ 20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో పొలార్డ్ కూడా ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన విధ్వసంకర బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ కరేబియన్ క్రికెటర్ 149.57 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 3350 రన్స్ చేశాడు. ఇందులో 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 66 వికెట్లు తీశాడు.
Maria Sharapova: తల్లి కాబోతున్న టెన్నిస్ తార మరియా షరపోవా.. నెట్టింట వైరలవుతోన్న బేబీ బంప్ ఫొటోలు