
Washington Sundar IPL records: ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న వాషింగ్టన్ సుందర్, కేవలం 17 ఏళ్ల ప్రాయంలోనే 2017లో ఐపీఎల్ బరిలోకి దిగాడు. తన కెరీర్ ఆరంభం నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యం ఉండటంతో ఫ్రాంచైజీలు ఇతనిపై ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటాయి.
వాషింగ్టన్ సుందర్ తన ఐపీఎల్ ప్రయాణంలో ఇప్పటివరకు నాలుగు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. పూణే సూపర్ జెయింట్స్‌తో మొదలుపెట్టి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదుగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టులో కొనసాగుతున్నాడు. సుమారు 68 మ్యాచ్‌లు ఆడిన సుందర్, 47 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం పొంది కేవలం 533 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 49 పరుగులు. అంటే కేవలం ఒక్క పరుగు తేడాతో తన తొలి అర్థశతకాన్ని కోల్పోయాడు.
బౌలింగ్ విషయానికి వస్తే, 64 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి కేవలం 40 వికెట్లు మాత్రమే ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడమే అతని అత్యుత్తమ ప్రదర్శన. ఏ సీజన్‌లోనూ కనీసం 10 వికెట్ల మైలురాయిని కూడా అతను చేరుకోలేకపోవడం గమనార్హం.
ఐపీఎల్ 2026 సీజన్‌లో సుందర్ గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలో కేవలం 22 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే జట్టు యాజమాన్యం అతనిపై పూర్తి నమ్మకంతో ఉంది. పదేళ్లుగా ఊరిస్తున్న అర్థశతకాన్ని, నాలుగు వికెట్ల ప్రదర్శనను ఈ సీజన్‌లోనైనా సాధించి, తనపై ఉన్న ‘అన్ లక్కీ’ ముద్రను చెరిపేసుకోవాలని ఈ యువ ఆల్ రౌండర్ పట్టుదలతో ఉన్నాడు. లీగ్‌లో నిలదొక్కుకోవాలంటే కేవలం చిన్న చిన్న సహకారాలు సరిపోవని, భారీ ప్రదర్శనలు అవసరమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..