వామ్మో.. వాయ్యో.. అదేం కొట్టుడ్రా? వరల్డ్ రికార్డ్ బ్రేక్.. టీ20 చరిత్రలోనే తొలిసారి!

మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడం 267 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి టీ20 చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 51 సిక్సర్లు, మూడు సెంచరీలు, 536 పరుగుల మ్యాచ్ అగ్రిగేట్‌తో పాటు పూరన్, గౌస్, స్టీవ్ స్మిత్, పొలార్డ్ పేరిట పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.

వామ్మో.. వాయ్యో.. అదేం కొట్టుడ్రా? వరల్డ్ రికార్డ్ బ్రేక్.. టీ20 చరిత్రలోనే తొలిసారి!
Smith, Gous

Updated on: Jul 16, 2026 | 3:03 PM

టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర నమోదైంది. గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో బ్యాటర్ల విధ్వంస సాగింది. దీంతో టీ20 హిస్టరీలోనే అత్యధిక రన్ ఛేజ్ సాధ్యమైంది. మేజర్ లీగ్ క్రికెట్ 2026లో వాషింగ్టన్ ఫ్రీడం, ఎంఐ న్యూయార్క్ మధ్య జరిగిన మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వాషింగ్టన్ ఫ్రీడం కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 270 పరుగులు చేసి 267 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదనగా ఇది కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఛేదించిన 265 పరుగుల రికార్డు ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది.

రికార్డుల మోత..

ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏమిటంటే మొత్తం 51 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 50కు పైగా సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. ఎంఐ న్యూయార్క్ బ్యాటర్లు 29 సిక్సర్లు బాదగా, వాషింగ్టన్ ఫ్రీడం 22 సిక్సర్లు కొట్టింది. గతంలో ఒక టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు 42 మాత్రమే. వాషింగ్టన్ ఫ్రీడం చేసిన 270/4 స్కోరు కూడా మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. ఇంతకుముందు ఇదే వేదికలో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ చేసిన 269/5 అత్యధిక స్కోరుగా ఉండేది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి మొత్తం 536 పరుగులు చేయగా, ఇది టీ20 చరిత్రలో రెండో అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్. 2024 ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు–సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో నమోదైన 549 పరుగులే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Video: స్థాయి కాదు.. స్నేహం ముఖ్యం! పేదింటి విందుకు హాజరైన IPL స్టార్..

ఈ మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం మరో చారిత్రక ఘట్టం. ఎంఐ న్యూయార్క్ తరఫున నికోలస్ పూరన్ 106 పరుగులు చేయగా, వాషింగ్టన్ ఫ్రీడం తరఫున ఆండ్రీస్ గౌస్ 132 పరుగులు, స్టీవ్ స్మిత్ అజేయంగా 110 పరుగులు చేశారు. టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. గౌస్, స్టీవ్ స్మిత్ మూడో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది టీ20 చరిత్రలో దేశీయ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. అంతేకాకుండా మేజర్ లీగ్ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి అమెరికా బ్యాటర్‌గా ఆండ్రీస్ గౌస్ చరిత్ర సృష్టించాడు.

నికోలస్ పూరన్ తన సెంచరీని కేవలం 31 బంతుల్లో పూర్తి చేసి ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. 2013 ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ మాత్రమే అతని కంటే వేగంగా ఉంది. అలాగే పూరన్ కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఎంఎల్‌సీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్ తన కెరీర్‌లో 1001వ సిక్సర్ బాది టీ20 క్రికెట్‌లో వెయ్యికి పైగా సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us