Cricket Records : ఎంత మంది తోపులొచ్చినా మనోడి రికార్డ్ సేఫ్ భయ్యా.. ట్రిపుల్ సెంచరీ లిస్టు చూస్తే పరేషానే

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 ఆటగాళ్ల జాబితా ఇదే. వీరేంద్ర సెహ్వాగ్ నంబర్ 1 స్థానంలో ఉండగా, వైన్ ముల్డర్ ఇటీవల రెండో స్థానంలో నిలిచాడు. హ్యారీ బ్రూక్, మాథ్యూ హేడెన్ కూడా ఈ ఎలైట్ జాబితాలో ఉన్నారు.

Cricket Records : ఎంత మంది తోపులొచ్చినా మనోడి రికార్డ్ సేఫ్ భయ్యా.. ట్రిపుల్ సెంచరీ లిస్టు చూస్తే పరేషానే
Wiaan Mulder

Updated on: Jul 07, 2025 | 8:46 PM

Cricket Records : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పేరు బాగా వినిపిస్తోంది. సౌతాఫ్రికా ఆటగాడు వైన్ ముల్డర్ 27 ఏళ్లకే ఏకంగా ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను చాలా వేగంగా ఈ పరుగులు చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే, ఈ జాబితాలో మొదటి స్థానంలో మాత్రం మన భారత స్టార్ ఆటగాడే ఉన్నాడు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా చేసిన టాప్ 5 ట్రిపుల్ సెంచరీలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

1. వీరేంద్ర సెహ్వాగ్ – 278 బంతులు

టీమిండియా స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు చెప్పగానే వేగంగా పరుగులు గుర్తుకు వస్తాయి. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డు అతని పేరిటే ఉంది. 2007-08లో సౌతాఫ్రికాపై కేవలం 278 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆ రోజు సెహ్వాగ్ కొట్టిన పరుగులు, ఫోర్లు, సిక్సర్లతో ఆ ఇన్నింగ్స్ టెస్ట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది మామూలు ఆట కాదు, ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఇన్నింగ్స్.

2. వైన్ ముల్డర్ – 297 బంతులు

సౌతాఫ్రికా ఆటగాడు వైన్ ముల్డర్, జింబాబ్వేపై అదరగొట్టాడు. కేవలం 297 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 38 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో అతను ఈ ఘనత సాధించిన రెండో అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. అలాగే, సౌతాఫ్రికా తరపున ఇంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు కూడా ఇతనే.

3. హ్యారీ బ్రూక్ – 310 బంతులు

ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కూడా ఈ టాప్ లిస్ట్‌లోకి వచ్చేశాడు. 2024-25 సీజన్‌లో పాకిస్తాన్‌తో ముల్తాన్‌లో జరిగిన టెస్టులో కేవలం 310 బంతుల్లోనే 300 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తరపున టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డు అతని పేరిట నమోదైంది.

4. మాథ్యూ హేడెన్ – 362 బంతులు

ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ కూడా దూకుడుగానే ఆడతాడు. 2003-04లో పెర్త్‌లో జింబాబ్వేపై 362 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. హేడెన్ బ్యాటింగ్ అంటేనే చాలా పవర్‌ఫుల్, అటాకింగ్. అతని ఆ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు టెస్టుల్లో ఆడిన అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.

5. వీరేంద్ర సెహ్వాగ్ – 364 బంతులు

ఈ లిస్ట్‌లో సెహ్వాగ్ పేరు మళ్లీ వచ్చింది. 2004లో ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై అతను సాధించిన 309 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 300 పరుగులను 364 బంతుల్లో చేరుకున్నాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం సాధించిన మొదటి ట్రిపుల్ సెంచరీ కూడా. అప్పుడు భారత క్రికెట్‌లో ఇది ఒక సంచలనం.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..