Virat Kohli : ఓడినా సరే ఫ్యాన్స్ మనసు గెలుచుకున్న విరాట్..కివీస్ పరుగుల వీరుడికి కోహ్లీ కానుక

Virat Kohli : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఓటమి ఎదురైనప్పటికీ, మైదానం వెలుపల ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్‌ను భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభినందించారు.

Virat Kohli : ఓడినా సరే ఫ్యాన్స్ మనసు గెలుచుకున్న విరాట్..కివీస్ పరుగుల వీరుడికి కోహ్లీ కానుక
daryl mitchell

Updated on: Jan 19, 2026 | 3:52 PM

Virat Kohli : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఓటమి ఎదురైనప్పటికీ, మైదానం వెలుపల ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్‌ను భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభినందించారు. తనను ఆదర్శంగా భావించే మిచెల్‌కు కోహ్లీ ఒక అమూల్యమైన బహుమతిని అందించాడు. భారత ఆటగాళ్లందరి సంతకాలు ఉన్న తన జెర్సీని మిచెల్‌కు కానుకగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వన్డే సిరీస్‌లో డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో ఏకంగా 352 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఇందులో 8 భారీ సిక్సర్లు, 31 ఫోర్లు ఉన్నాయి. అతని బ్యాటింగ్ సగటు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.. ఏకంగా 176 సగటుతో మిచెల్ పరుగులు సాధించాడు. తన రోల్ మోడల్ అయిన విరాట్ కోహ్లీని కూడా ఈ సిరీస్‌లో మిచెల్ అధిగమించాడు. కోహ్లీ 240 పరుగులు చేయగా, మిచెల్ అంతకంటే వంద పరుగులు ఎక్కువే చేసి కివీస్ సిరీస్ గెలవడంలో ప్రధాన కారకుడయ్యాడు.

భారత పిచ్‌లపై ఇంతలా ఎలా రాణించగలిగారని అడిగినప్పుడు, మిచెల్ దీనికి కారణం ఐపీఎల్ అని సమాధానమిచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల తరపున ఆడిన అనుభవం తనకు ఇక్కడ బాగా పనికొచ్చిందని చెప్పాడు. భారత వాతావరణం, ఇక్కడి అభిమానుల మధ్య ఆడటం తనకు ఎంతో ఇష్టమని మిచెల్ పేర్కొన్నాడు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే.. 2026 ఐపీఎల్ వేలంలో ఏ జట్టూ అతనిని కొనుగోలు చేయలేదు. కానీ లేటెస్ట్ ఫామ్ చూశాక.. ఎవరైనా ఆటగాడు గాయపడితే మిచెల్‌కు వెంటనే పిలుపు రావడం ఖాయం.

సిరీస్ విజయం అనంతరం మిచెల్ ఉద్వేగంగా మాట్లాడాడు. “భారత్‌ను వారి సొంత గడ్డపై టెస్ట్, వన్డే ఫార్మాట్లలో ఓడించడం మామూలు విషయం కాదు. గతంలో చాలా కివీస్ జట్లు ఇక్కడ పర్యటించాయి, కానీ ఈ టీమ్ సాధించిన ఘనత చాలా ప్రత్యేకం” అని చెప్పాడు. భారత్ వంటి పటిష్టమైన జట్టును వారి గడ్డపై ఓడించడం ప్రతి ఆటగాడికి గర్వకారణమని ఆయన భావించాడు. కోహ్లీ ఇచ్చిన జెర్సీని తన జీవితాంతం గుర్తుంచుకుంటానని, ఇది ఒక గొప్ప జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశాడు.

మైదానంలో ఎంత దూకుడుగా ఉన్నా, బయట విరాట్ కోహ్లీ ప్రవర్తించే తీరు ఎప్పుడూ ప్రశంసనీయం. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా, మంచి ప్రదర్శన చేసినప్పుడు వారిని ప్రోత్సహించడంలో విరాట్ ముందుంటాడు. గతంలో బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి ఆటగాళ్లకు కూడా కోహ్లీ తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు మిచెల్‌కు కూడా జెర్సీని ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా తనకున్న అభిమానుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు.