
సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున, అంటే.. ఫిబ్రవరి 28, 2012లో ఇండియా – శ్రీలంక మ్యాచ్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో కుర్ర విరాట్ కోహ్లీ శివతాండవం చేశాడు. రామాయణంలో ఆంజనేయుడు లంకకు తన తోకతో మొత్తం నిప్పు అంటించాడని చదువుకున్నాం. అయితే ఇక్కడ మాత్రం విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో శ్రీలంకకు నిప్పుపెట్టేశాడు. ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక మధ్య కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్ జరిగింది. ఒక్కో జట్టు మిగిలిన రెండు టీమ్స్‌తో తలో నాలుగు మ్యాచ్‌లు ఆడాలి. టీమిండియా ఆసీస్‌పై ఒక మ్యాచ్ గెలిచి మూడు ఓడింది. లంకపై ఒకటి ఓడింది, ఒకటి గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది. ఒక లంకతో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఆ సిరీస్‌లో ఉంటుంది. అంటే తర్వాత ఆస్ట్రేలియా మూడు ఫైనల్స్‌లో తలపడే ఛాన్స్ సజీవంగా ఉంటుంది.
అలాంటి ఎంతో కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్‌కు దిగి కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ 160, కుమార సంగాక్కర 105 పరుగులతో చెలరేగారు. టీమిండియా ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండేందుకు కేవలం మ్యాచ్ గెలిస్తే సరిపోదు.. 321 పరుగుల టార్గెట్ 40 ఓవర్లలోనే చేధించాలి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియా 86 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సచిన్ టెండూల్కర్ 39 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అంతకంటే ముందు సెహ్వాగ్ 30 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. రెండో వికెట్ పడిన తర్వాత 23 ఏళ్ల కుర్ర విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే గంభీర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు.
ఇది కూడా చదవండి: కష్ట సమయాల్లో తానొక్కడే ఉన్నాడు! కెప్టెన్సీ డ్రాప్ విషయంపై కోహ్లీ ఓపెన్ స్టేట్మెంట్
అప్పటి వరకు కోహ్లీ అంటే బాగా ఆడతాడు అనే పేరుంది కానీ, ఆ ఇన్నింగ్స్‌లో అతని ఆట చూసి ప్రపంచ క్రికెట్ ఉలిక్కిపడింది. మలింగా అనే లంక బౌలర్ అప్పటికే ప్రపంచంలోని హేమాహేమీ బ్యాటర్లను వణికిస్తున్నాడు. మలింగ్ కెరీర్ మొత్తంలో ప్రైమ్ టైమ్ అంటే ఆ ఏడాది. అలాంటి టైమ్‌లో మలింగా కొట్టాడు కోహ్లీ.. అబ్బో అది మామూలు కొట్టుడు కాదు. కోహ్లీ దెబ్బకు ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న మలింగా తన 10 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేకపోయాడు. కేవలం 7.4 ఓవర్లలోనే ఏకంగా 96 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కేవలం 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సులతో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. టీమిండియా అద్బుతమైన విజయం అందించాడు. భారత క్రికెట్ చరిత్రలో అతి గొప్ప విజయాల్లో ఈ మ్యాచ్ గురించి కూడా చెప్పుకుంటారు. అలాగే కోహ్లీ కెరీర్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది.
ఆ పొద్దు కోహ్లీ ఆడుతున్న షాట్లు చూసి.. లంక ఆటగాళ్లు బెదిరిపోయారు. మొత్తంగా టీమిండియా కేవలం 36.4 ఓవర్లలోనే 321 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌చేసింది. అప్పటి నుంచే విరాట్ కోహ్లీకి ఛేజ్ మాస్టర్ అనే బిరుదు వచ్చింది. సిరీస్‌లో ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే 40 ఓవర్లలో కొట్టాల్సిన టార్గెట్‌ను కోహ్లీ తన పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో 36.4 ఓవర్లలోనే ఊదిపారేశాడు. కోహ్లీకి గంభీర్, రైనా మంచి సపోర్ట్ అందించారు. దురదృష్టవశాత్తు తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై శ్రీలంక గెలించి ఫైనల్ వెళ్లింది. మూడు ఫైనల్స్‌లో ఆసీస్ రెండు, శ్రీలంక ఒక మ్యాచ్ గెలవడంతో.. ఈ కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో ఆసీస్ విజేతగా నిలిచింది. కానీ, ఆ సిరీస్ మొత్తానికి కోహ్లీ ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్‌కు నేటితో 13 ఏళ్లు పూర్తి అయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.