
Viral : విశాఖపట్నంలో జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయంలో యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర పోషించగా సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లీ హీరోగా నిలిచారు. చివరి మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 65 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే బ్యాటింగ్‌తో పాటు, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ తన ట్రోలింగ్ స్కిల్స్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన సరదా ట్రోలింగ్‌కు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బలైపోయారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
కోహ్లీని ప్రశ్నించిన అర్ష్‌దీప్ సింగ్
చివరి వన్డేలో భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌ల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం (155 రన్స్)తో సగం పని పూర్తి కాగా, మిగిలిన పనిని విరాట్ కోహ్లీ (65* పరుగులు) పూర్తి చేశారు. వరుసగా రెండు సెంచరీలు చేసిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లో మాత్రం స్కోర్ తక్కువగా ఉండటం వలన సెంచరీ హాట్రిక్ మిస్ చేసుకున్నారు. భారత్ గెలిచిన వెంటనే, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన మొబైల్‌లో వీడియో తీస్తూ సరదాగా కోహ్లీని ప్రశ్నించారు. అన్న రన్స్ తక్కువయ్యాయి కానీ లేకపోతే సెంచరీ పక్కా అయ్యేది కదా అని అన్నారు.
అర్ష్‌దీప్‌కు కోహ్లీ షాకింగ్ కౌంటర్
అర్ష్‌దీప్ ప్రశ్నకు విరాట్ కోహ్లీ ఇచ్చిన సమాధానం అద్భుతం. అర్ష్‌దీప్ సింగ్ లేదా అక్కడ ఉన్నవారు ఎవరూ ఆ సమాధానాన్ని ఊహించలేదు. కోహ్లీ వెంటనే, సరదాగా ఆటపట్టిస్తూ ఇలా అన్నారు..”టాస్ గెలవకపోతే నీకూ సెంచరీ పక్కా అయ్యేది డ్యూ (మంచు)లో!” కోహ్లీ ఈ మాట అనగానే ఇద్దరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. కోహ్లీ ఈ విధంగా మాట్లాడటానికి కారణం ఉంది. ఈ సిరీస్‌లోని గత రెండు మ్యాచ్‌లలో భారత్ టాస్ ఓడిపోవడంతో, మంచు ప్రభావం కారణంగా బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లందరితో పాటు అర్ష్‌దీప్ కూడా గత రెండు మ్యాచ్‌లలో భారీగా పరుగులు ఇచ్చారు. ఈ చివరి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. ఈ విషయాన్నే గుర్తుచేస్తూ కోహ్లీ “టాస్ గెలవకపోతే మంచు కారణంగా నీ బౌలింగ్‌లో పరుగులు ఇచ్చి సెంచరీ(100 రన్స్) పక్కా అయ్యేది” అని చమత్కరించారు.