
Virat Kohli : క్రికెట్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత క్రికెట్‌లో రెండు పవర్-హౌస్‌లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి రానున్నారు. మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన తర్వాత వీరు మళ్లీ జాతీయ జట్టు జెర్సీలో కనిపించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకొని పెర్త్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటోంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే అరుదైన అవకాశం లభించింది.
ఆస్ట్రేలియాపై జరగబోయే ఈ వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి కేవలం ఒక్క సెంచరీ చేస్తే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి వన్డేల్లో 51 సెంచరీలు సాధించి ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే, ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు (52) చేసిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. సచిన్ టెండూల్కర్ టెస్ట్ ఫార్మాట్‌లో 51 సెంచరీలు సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ 1989 నుంచి 2013 మధ్య 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి వన్డే ఫార్మాట్‌లో 52 సెంచరీలు సాధించి, సచిన్ టెస్ట్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
వాస్తవానికి, వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ఇప్పటికే విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2023 ప్రపంచ కప్‌లో సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాపై 50వ సెంచరీ, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై 51వ సెంచరీ నమోదు చేశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును సమం చేయాలంటే విరాట్‌కు ఇంకా 18 సెంచరీలు అవసరం. ఏది ఏమైనా ఆస్ట్రేలియాపై మరో సెంచరీ సాధిస్తే, ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల ఘనతను సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
భారత్ vs ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు
మొదటి వన్డే: అక్టోబర్ 19 – పెర్త్ స్టేడియం
రెండవ వన్డే: అక్టోబర్ 23 – అడిలైడ్
మూడవ వన్డే: అక్టోబర్ 25 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్
ఈ వన్డే సిరీస్‌లో మాత్రమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడనున్నారు. ఆ తర్వాత జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత వన్డే జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..