Virat Kohli : మహాకాళుని చెంత కోహ్లీ, కుల్దీప్..ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు

Virat Kohli : భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఇండోర్ చేరుకుంది. సిరీస్ 1-1 తో సమానంగా ఉండటంతో, గెలుపు గుర్రం ఎక్కాలనే కసితో ఆటగాళ్లు ఉన్నారు. అయితే మైదానంలో చెమటోడ్చడమే కాకుండా, దైవబలం కోసం టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టారు.

Virat Kohli : మహాకాళుని చెంత కోహ్లీ, కుల్దీప్..ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
Virat Kohli

Updated on: Jan 17, 2026 | 9:48 AM

Virat Kohli : భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఇండోర్ చేరుకుంది. సిరీస్ 1-1 తో సమానంగా ఉండటంతో, గెలుపు గుర్రం ఎక్కాలనే కసితో ఆటగాళ్లు ఉన్నారు. అయితే మైదానంలో చెమటోడ్చడమే కాకుండా, దైవబలం కోసం టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇండోర్‌కు అతి సమీపంలో ఉన్న ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ శనివారం తెల్లవారుజామున సందర్శించుకున్నారు.

భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు ఆధ్యాత్మిక ధోరణి బాగా కనిపిస్తోంది. కీలకమైన మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు ఉజ్జయిని మహాకాళుడిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అత్యంత పవిత్రమైన భస్మ హారతిలో విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపిన వీరు, నంది హాల్‌లో కూర్చుని పరమశివుని నామస్మరణలో మునిగిపోయారు. గర్భాలయ చౌకట్ నుంచి స్వామివారిని దర్శించుకుని జలాభిషేకం చేశారు. ఆలయ కమిటీ వారికి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహుకరించింది.

మహాకాళేశ్వర్ ఆలయ ప్రత్యేకత ఏంటి?

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం అత్యంత విశిష్టమైనది. ఇది దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం కావడం దీని ప్రత్యేకత. ఇక్కడ జరిగే భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో పూజలు చేస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుందని, తలపెట్టిన కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కేవలం క్రికెటర్లే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తమ కెరీర్‌లో కష్టకాలం ఎదురైనప్పుడు లేదా పెద్ద విజయాలు సాధించినప్పుడు ఇక్కడికి వస్తుంటారు. కెఎల్ రాహుల్, గౌతమ్ గంభీర్ కూడా నిన్ననే ఈ ఆలయాన్ని సందర్శించడం విశేషం.

ఇండోర్ గడ్డపై కోహ్లీ గండం గట్టెక్కుతుందా?

విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మైదానాల్లో సెంచరీలు ఉన్నాయి కానీ, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మాత్రం ఒక వింతైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో కోహ్లీ కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా ఇక్కడ నమోదు కాలేదు. ప్రపంచకప్ ముందు తన ఫామ్‌ను కొనసాగించాలన్నా, ఈ స్టేడియంలో తన బ్యాడ్ రికార్డును చెరిపేయాలన్నా కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. అందుకే మహాకాళుడి ఆశీస్సులతో ఈసారి ఇండోర్‌లో కోహ్లీ తన సెంచరీ కరువును తీర్చుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

 

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..