
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో కింగ్ కోహ్లీగా ప్రఖ్యాతి గాంచిన విరాట్ కోహ్లీకి నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డే మ్యాచ్‌ల సౌతాఫ్రికా సిరీస్ చాలా కీలకం కానుంది. ఇది కోహ్లీకి కేవలం ఒక సాధారణ సిరీస్ కాదు, ఏకంగా తొమ్మిదికి పైగా అరుదైన ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకునే అద్భుతమైన అవకాశం. అత్యంత వేగంగా 28,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడం నుంచి, ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించడం వరకు… ఈ సిరీస్‌లో విరాట్ కొట్టే ప్రతి పరుగు చరిత్ర సృష్టించనుంది.
ఒకే ఫార్మాట్‌లో సెంచరీల రారాజు
విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో 51 సెంచరీలతో, టెస్టుల్లో 51 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డుతో సమంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో విరాట్ కేవలం ఒక్క సెంచరీ సాధిస్తే, వన్డేల్లో 52 సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. తద్వారా అతను ఏ ఒక్క ఫార్మాట్‌లో అయినా అత్యధిక సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచి, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. ఈ అరుదైన రికార్డు కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో వేగవంతమైన రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా కోహ్లీ ముందున్నాడు. విరాట్ 28,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడానికి 327 పరుగులు మాత్రమే అవసరం. రాబోయే 23 ఇన్నింగ్స్‌లలో విరాట్ ఈ పరుగులు చేస్తే, అత్యంత వేగంగా 28,000 పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుతం విరాట్ ఖాతాలో 27,673 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. అతను కేవలం 344 పరుగులు చేస్తే, శ్రీలంక దిగ్గజం కుమార సంగాక్కర (28,016 పరుగులు)ను అధిగమించి, సచిన్ టెండూల్కర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు.
సౌతాఫ్రికాపై, సొంతగడ్డపై ప్రత్యేక రికార్డులు
ఈ సిరీస్‌లో విరాట్ సౌతాఫ్రికాపై, భారత గడ్డపై కూడా అనేక ప్రత్యేక రికార్డులు సాధించే అవకాశం ఉంది. కేవలం ఒక సెంచరీ సాధిస్తే, సౌతాఫ్రికాపై 6 వన్డే సెంచరీలు చేసిన ప్రపంచంలోనే ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. అలాగే, గెలిచిన మ్యాచ్‌లలో మరో 14 పరుగులు చేస్తే, సౌతాఫ్రికాపై భారత్ విజయాలలో 1000 వన్డే పరుగులు చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టిస్తాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై గెలిచిన వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డుకు కేవలం 16 పరుగులు దూరంలో మాత్రమే ఉన్నాడు.
స్వదేశంలో ఒక 50+ స్కోరు సాధిస్తే, భారత గడ్డపై వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన రికార్డును సొంతం చేసుకుంటాడు. అంతేకాకుండా, ఒక హాఫ్ శతకం సాధిస్తే, దేశీయ మైదానాల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా అరుదైన మైలురాయిని చేరుకుంటాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..