
IND vs ENG Test Series: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి 2 మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ భాగం కాదు. సిరీస్‌కు ముందే, అతను మొదటి 2 టెస్టుల నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత విరాట్ ఎందుకు విరామం తీసుకున్నాడనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లి తల్లి సరోజ్ కోహ్లి అనారోగ్యంతో ఉన్నారని, అందుకే అతను మొదటి 2 టెస్టులకు అందుబాటులో లేడని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, విరాట్ తన భార్య అనుష్క శర్మ కారణంగా తన పేరును ఉపసంహరించుకున్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాలపై విరాట్ అన్నయ్య వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.
వికాస్ తన తల్లి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను పూర్తిగా తోసిపుచ్చాడు. సరైన సమాచారం లేకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను కోరారు. విరాట్ కోహ్లి తన తల్లి అనారోగ్యం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి విరామం కోరినట్లు పుకార్లు వచ్చాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి కోహ్లీ తల్లి కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆమె గురుగ్రామ్‌లోని సికె బిర్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అలాగే, కొన్ని పోస్ట్‌లలో కోహ్లీ బ్రేక్‌కి కారణం అతని భార్య అనుష్క శర్మ అని కూడా వినిపించాయి. అయితే కోహ్లీ తొలి 2 టెస్టులు ఎందుకు ఆడడం లేదనే విషయంపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
ఇలాంటి పుకార్ల తర్వాత వికాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో “మా అమ్మ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందడం నేను చూశాను. మా అమ్మ ఖచ్చితంగా ఫిట్, బాగానే ఉందని నేను స్పష్టం చేస్తున్నాను. సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని ప్రతి ఒక్కరినీ, మీడియాను అభ్యర్థిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. అంతకుముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోహ్లి గోప్యతను గౌరవించాలని, ఇంగ్లాండ్‌తో జరిగే 5-టెస్టుల సిరీస్‌లో మొదటి 2 మ్యాచ్‌ల నుంచి అతను వైదొలగడానికి గల కారణాల గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభిమానులు, మీడియాను కోరింది.
కోహ్లి గైర్హాజరీతో ఆడిన తొలి టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80), రవీంద్ర జడేజా (87) అర్ధ సెంచరీల సాయంతో భారత జట్టు 436 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆలీ పోప్ సెంచరీతో ఇంగ్లండ్ 420 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అతను 28 మ్యాచ్‌ల్లో 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 5 సెంచరీలు కూడా చేశాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (2535) మొదటి స్థానంలో, సునీల్ గవాస్కర్ (2483) రెండో స్థానంలో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..