
Virat Kohli : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అలీబాగ్‌లోని జీరాడ్ గ్రామంలో 5.19 ఎకరాల సువిశాలమైన భూమిని కొనుగోలు చేశారు. దీని కోసం వారు రూ.37.86 కోట్లు వెచ్చించినట్లు రియల్ ఎస్టేట్ డేటా సంస్థ CRE మ్యాట్రిక్స్ వెల్లడించింది. కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే ఈ జంట ఏకంగా రూ.2.27 కోట్లు చెల్లించడం విశేషం. జనవరి 13న ఈ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ, అనుష్క తండ్రి కల్నల్ అజయ్ శర్మ ఈ డీల్ పనులను దగ్గరుండి పూర్తి చేశారు. విరాట్ దంపతులకు అలీబాగ్ అంటే మొదటి నుంచీ చాలా ఇష్టం. 2022లోనే వీరు అక్కడ 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, సుమారు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన హాలిడే హోమ్‌ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం వీరు ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నప్పటికీ, ఇండియాకు వచ్చినప్పుడు ఈ లగ్జరీ విల్లాలోనే గడుపుతుంటారు. అదే ప్రాంతంలో ఇప్పుడు మరో 5 ఎకరాలు కొనుగోలు చేయడం చూస్తుంటే.. భవిష్యత్తులో ఇక్కడే మరిన్ని భారీ నిర్మాణాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
వ్యాపారాల్లోనే కాదు, క్రికెట్ మైదానంలో కూడా కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో సుమారు ఐదు ఏళ్ల తర్వాత మళ్ళీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జనవరి 14న విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి కోహ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం అభిమానులకు పెద్ద పండగలా మారింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడవ, చివరి వన్డే శనివారం (జనవరి 18) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోహ్లీకి చాలా కీలకం. ఎందుకంటే ఈ సీజన్‌లో టీమిండియా తరఫున విరాట్ ఆడే ఆఖరి వన్డే ఇదే కావచ్చు. దీని తర్వాత చాలా నెలల వరకు భారత్ వన్డేలు ఆడటం లేదు. మళ్ళీ ఐపీఎల్ 2026లో మాత్రమే కోహ్లీ మైదానంలో కనిపించే అవకాశం ఉంది. అందుకే ఇండోర్ వన్డేలో భారీ స్కోరు సాధించి ఈ సీజన్‌ను ఘనంగా ముగించాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..