
Video : పాకిస్థాన్ క్రికెటర్లకు ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ నుంచి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వరకు ఎక్కడ చూసినా పాక్ ఆటగాళ్లకు అవమానాలే ఎదురవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లీగ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన ఓ అత్యుత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులపాలు చేస్తోంది. బౌలర్‌ను వెక్కిరించబోయి తనే బలికావడమే కాకుండా, ప్రత్యర్థి బౌలర్ చేతిలో ఘోరమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌షాహి వారియర్స్ తరపున ఆడుతున్న సాహిబ్జాదా ఫర్హాన్, సిల్హెట్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వింతగా ప్రవర్తించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బంగ్లాదేశ్ బౌలర్ రుయెల్ మియా వేసిన బంతిని ఫర్హాన్ డిఫెండ్ చేశాడు. బంతి బౌలర్ దగ్గరకు వెళ్లగానే, ఫర్హాన్ తన చేతిని ముఖం ముందుకు తెచ్చి హాలీవుడ్ రెజ్లర్ జాన్ సీనా స్టైల్లో యు కాంట్ సీ మీ అంటూ బౌలర్‌ను వెక్కిరించాడు. తనేదో తోపు బ్యాటర్ లాగా బౌలర్‌ను కించపరిచేలా ప్రవర్తించడం స్టేడియంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
ఫర్హాన్ చేసిన ఈ వెటకారానికి రుయెల్ మియా సరైన సమాధానం ఇచ్చాడు. మరుసటి బంతికే ఫర్హాన్ భారీ షాట్ కొట్టబోయి షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 12 బంతుల్లో 14 పరుగులు చేసిన ఫర్హాన్, తల పట్టుకుని పెవిలియన్ వైపు నడిచాడు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ బౌలర్ సెలబ్రేషన్. వికెట్ తీసిన రుయెల్ మియా, దూకుడుగా ప్రవర్తించకుండా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఫేమస్ స్టైల్లో మైదానంలో పడుకుని వింతగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
3.2 over mark – Sahibzada Farhan mocked bangladesh's domestic bowler Ruyel Miah.
3.3 over mark – Ruyel Miah got his wicket & gave him a humiliating send-off.
Man, this is their routin.
Eat-Sleep-Get Humiliated-Repeat😭pic.twitter.com/vEAnyTznvJ— Rajiv (@Rajiv1841) January 17, 2026
కేవలం ఫర్హాన్ మాత్రమే కాదు, ఇతర పాక్ స్టార్లు కూడా విదేశీ లీగ్ లలో విమర్శల పాలవుతున్నారు. బిగ్ బాష్ లీగ్‌లో షాహీన్ అఫ్రిదీ ఒకే ఓవర్‌లో రెండు బీమర్లు వేసి బౌలింగ్ నుంచి నిషేధానికి గురయ్యాడు. అటు మహ్మద్ రిజ్వాన్ నెమ్మదిగా ఆడుతున్నాడని కెప్టెన్ అతడిని రిటైర్డ్ అవుట్ చేయగా, బాబర్ ఆజంకు సింగిల్ ఇచ్చేందుకు స్టీవ్ స్మిత్ నిరాకరించడం పెద్ద దుమారం రేపింది. పాక్ ఆటగాళ్ల ప్రవర్తన, వారి ఆటతీరు చూస్తుంటే.. “తినడం, పడుకోవడం, అవమానపడటం.. మళ్ళీ రిపీట్ చేయడం” అన్నట్లుగా మారిపోయిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..