IND vs SA 2nd Test : గెలవడానికి కాదు..కాపాడుకోవడానికి ఆడుతున్నాం..టీమిండియా మేనేజ్‌మెంట్‌పై విరాట్ అన్న ఫైర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమి అంచున ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ పరోక్షంగా జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. మొదటి టెస్ట్‌ను 30 పరుగుల తేడాతో ఓడిన భారత్.. గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.

IND vs SA 2nd Test : గెలవడానికి కాదు..కాపాడుకోవడానికి ఆడుతున్నాం..టీమిండియా మేనేజ్‌మెంట్‌పై విరాట్ అన్న ఫైర్
Vikas Kohli

Updated on: Nov 26, 2025 | 9:41 AM

IND vs SA 2nd Test : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమి అంచున ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ పరోక్షంగా జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. మొదటి టెస్ట్‌ను 30 పరుగుల తేడాతో ఓడిన భారత్.. గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ విజయం అసాధ్యమని భావిస్తున్న తరుణంలో టీమ్ మేనేజ్‌మెంట్‌లో చేసిన అనవసర మార్పులే ఈ వైఫల్యానికి కారణమని వికాస్ కోహ్లీ తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు.

వికాస్ కోహ్లీ తన థ్రెడ్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన నేరుగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు కోచ్, ప్రస్తుత మేనేజ్‌మెంట్ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. “ఒకప్పుడు విదేశీ పిచ్‌లపై కూడా గెలవడానికి ఆడేవాళ్ళం.. ఇప్పుడు మన దేశంలో కూడా మ్యాచ్ కాపాడుకోవడానికి ఆడుతున్నాం. బాగున్న సిస్టమ్‌లో అనవసరంగా పెత్తనం చేసి, మార్పులు చేస్తే ఇలాగే జరుగుతుంది” అని వికాస్ కోహ్లీ ఆ పోస్ట్‌లో ఘాటుగా రాశారు.

ప్రస్తుత టీమిండియా మేనేజ్‌మెంట్‌లో కోచ్‌గా గౌతమ్ గంభీర్తో పాటు, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్, టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉన్నారు. కోచ్ గంభీర్ సారథ్యంలో భారత టెస్ట్ ప్రదర్శన క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆయన పదవీకాలంలో జట్టు గెలుపు కంటే ఓటములనే ఎక్కువగా నమోదు చేసింది. ముఖ్యంగా సొంతగడ్డపై కూడా టీమిండియా కష్టపడటం ఆందోళన కలిగిస్తోంది.

భారత టాప్ సిక్స్ బ్యాట్స్‌మెన్ సగటు ఈ మధ్యకాలంలో 30 కంటే తక్కువగా నమోదైంది. గతంలో నిలకడగా 300కు పైగా పరుగులు చేసే భారత జట్టు, ఇప్పుడు ఆ మార్క్‌ను కూడా అందుకోలేకపోతోంది. ఈ వైఫల్యం జరగడానికి ప్రధాన కారణం భారత బ్యాటింగ్ లైనప్‌ను ఒక దశాబ్దం పాటు నిలబెట్టిన ఇద్దరు దిగ్గజాలు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి ఇటీవల రిటైర్ కావడం. ఈ ఖాళీని భర్తీ చేయడంలో జట్టు మేనేజ్‌మెంట్ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి.

గంభీర్ కోచింగ్‌లో భారత్ గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో 3-0 వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా 3-1తో ఓడిపోయింది. ఈ ఓటములతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా భారత్ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడిపోయి, రెండో మ్యాచ్‌లోనూ ఓటమి అంచున ఉంది. ఇది సొంతగడ్డపై మరో క్లీన్ స్వీప్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..