
IPL 2026 CSK : తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు చర్చలన్నీ విజయ్ రాజకీయం కంటే ఎక్కువగా.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం మీదకు మళ్ళాయి. తమిళనాడులో ప్రభుత్వం మారినప్పుడల్లా చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొడుతుందనే ఒక విచిత్రమైన సెంటిమెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గత చరిత్రను తిరగేస్తే ఈ లెక్కలు నిజమే అనిపిస్తుండటంతో ధోనీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఏమిటా వింత సెంటిమెంట్?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, సీఎస్కే విజయాలకు మధ్య ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉందని క్రికెట్ ప్రియులు విశ్లేషిస్తున్నారు. 2011 నుంచి గమనిస్తే.. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి కొత్త సీఎం బాధ్యతలు చేపట్టినా, అదే ఏడాది చెన్నై జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలుస్తోంది. ఇదో యాదృచ్ఛికమో లేక అదృష్టమో కానీ, ఇప్పుడు 2026లో కూడా అదే పునరావృతం కాబోతోందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
చరిత్ర ఏం చెబుతోంది?
ఈ సెంటిమెంట్‌కు బలం చేకూర్చేలా గతంలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి.
2011లో: తమిళనాడులో అన్నాడీఎంకే విజయం సాధించి, జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా అదే ఏడాది ధోనీ నాయకత్వంలోని సీఎస్కే జట్టు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
2021లో: పదేళ్ల తర్వాత మళ్ళీ సమీకరణాలు మారాయి. డీఎంకే అధికారంలోకి రాగా, ఎం.కె.స్టాలిన్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆశ్చర్యకరంగా ఆ ఏడాది కూడా దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై గెలిచి నాలుగోసారి కప్పు కొట్టింది.
విజయ్ హవా.. సీఎస్కే జోరు
ఇప్పుడు 2026లో తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ విజయం సాధించింది. విజయ్ సీఎంగా గద్దెనెక్కారు. ఈ పరంపరను గమనిస్తున్న నెటిజన్లు.. “గతంలో జయలలిత, స్టాలిన్ సీఎంలైనప్పుడు సీఎస్కే గెలిచింది.. ఇప్పుడు విజయ్ వచ్చారు కాబట్టి కప్పు గ్యారెంటీగా మనదే” అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. దీనికి తోడు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్కే ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తుండటం ఈ సెంటిమెంట్‌పై నమ్మకాన్ని మరింత పెంచుతోంది.
క్రికెట్ లెక్కలు వర్సెస్ సెంటిమెంట్
క్రికెట్ అనేది కేవలం సెంటిమెంట్ల మీద ఆధారపడి ఉండదు. ఆటగాళ్ల ప్రతిభ, వ్యూహాలు ముఖ్యం. అయితే ఐపీఎల్ వంటి భారీ టోర్నీల్లో ఇలాంటి లక్కీ ఫ్యాక్టర్స్ చర్చకు రావడం సర్వసాధారణం. జయలలిత, స్టాలిన్ హయాం తర్వాత ఇప్పుడు విజయ్ కాలంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధిస్తే.. ఈ సెంటిమెంట్ ఐపీఎల్ చరిత్రలో ఒక చెరపలేని రికార్డుగా నిలిచిపోతుంది. మరి తలైవా విజయ్ ముఖ్యమంత్రి కావడమే మన తలై ధోనీ టీమ్‌కు కలిసొస్తుందో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..