
Vaibhav Suryavanshi : దుబాయ్‌లోని ది సెవెన్స్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025లో ఇండియా వర్సెస్ మలేషియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వైభవ్ కేవలం 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 భారీ సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, దురదృష్టవశాత్తు ఆ తర్వాతి బంతికే అతను అవుట్ అయ్యాడు.
ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రికార్డుకు అత్యంత చేరువయ్యాడు. వైభవ్ ఇప్పటివరకు ఆడిన 14 యూత్ వన్డేల్లో 782 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా విరాట్ కోహ్లీ 2006 నుంచి 2008 మధ్య 28 మ్యాచుల్లో 46.57 సగటుతో 978 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి మధ్య కేవలం 196 పరుగుల తేడా మాత్రమే ఉంది. రాబోయే కొద్ది మ్యాచుల్లోనే వైభవ్ ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
యూత్ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు ప్రస్తుతం సీనియర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ 1386 పరుగులు, శుభ్‌మన్ గిల్ 1149 పరుగులు సాధించారు.
అయితే భారత్ తరఫున యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం విజయ్ జోల్ పేరిట ఉంది. ఆయన 2012 నుంచి 2014 మధ్యకాలంలో 1404 పరుగులు చేశాడు. అయినప్పటికీ, విజయ్ జోల్‌కు సీనియర్ టీమ్‌లో మాత్రం స్థానం దక్కలేదు. ఇండియా వర్సెస్ మలేషియా అండర్-19 మ్యాచ్ వివరాలు చూస్తే.. మలేషియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. భారత అండర్-19 జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. భారత ప్లేయింగ్ XI లో ఆయుష్ మ్హాట్రే (కెప్టెన్)తో పాటు వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వంటి ఆటగాళ్లు ఉన్నారు. భారత జట్టు ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించే దిశగా పయనిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..