
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన సరికొత్త అధ్యాయం నమోదైంది. బీహార్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి సరికొత్త రికార్డులను తిరగరాశాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్ కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో ఈ యువ ఆటగాడికి చోటు దక్కింది. దీనితో భారత జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల నాటి సుదీర్ఘ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. గతంలో సచిన్ 1989 లో పాకిస్తాన్‌పై తన 16వ ఏట అంతర్జాతీయ అరంగేట్రం చేయగా, వైభవ్ అంతకంటే తక్కువ వయస్సులోనే భారత జట్టు జెర్సీని ధరించడం విశేషం.
వైభవ్ సూర్యవంశీకి ఇంత చిన్న వయస్సులోనే భారత జట్టులో అవకాశం రావడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2026లో అతడు సృష్టించిన పరుగుల సునామీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, టోర్నమెంట్‌లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. అది కూడా 237.30 అనే భారీ స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడమే కాకుండా, ఒకే సీజన్‌లో రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతనికి ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి.
ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న ఆనందంలో ఉన్నప్పటికీ, రికార్డులు కొల్లగొట్టిన వైభవ్‌ను రారాజు విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా అభినందించాడు. ఆ సమయంలో కోహ్లీ, వైభవ్‌తో అన్న మాటలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మారుమోగిపోతున్నాయి. “నువ్వు, నీ బ్యాట్ మాత్రమే మైదానంలో మాట్లాడాలి.. ఒక్క బీహారీ వస్తే అందరి ఆట ముగిసిపోవాలి” అంటూ కోహ్లీ ఇచ్చిన బూస్టింగ్ వైభవ్ జీవితంలో మరిచిపోలేనిదిగా నిలిచిపోయింది. వైభవ్ సాధించిన ఈ విజయం అతడి సొంత ఊరైన బీహార్‌లోని సమస్తీపూర్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది.
సమస్తీపూర్ నుంచి అంతర్జాతీయ స్థాయికి
బీహార్ రాష్ట్రం భారత క్రికెట్‌లో ఎప్పుడూ ఒక అంచున మాత్రమే ఉంటూ వచ్చింది. అక్కడ టాలెంట్‌కు కొదవ లేకపోయినా, సరైన అవకాశాలు, మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఎంతో మంది యువ ఆటగాళ్లు క్రికెట్ ఆడేందుకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. గతంలో 2000 సంవత్సరంలో బీహార్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపును బీసీసీఐ రద్దు చేయడం, అలాగే ఇటీవల 2024 లో రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం రెండు వేర్వేరు జట్లు మైదానంలోకి రావడం వంటి వివాదాలు బీహార్ క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి వచ్చి, వైభవ్ సూర్యవంశీ కేవలం తన ప్రతిభతోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించి బీహార్ రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటాడు.
ఎంఎస్ ధోని నుంచి ఇషాన్ కిషన్ వరకు
భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, బీహార్ మట్టిలో పుట్టి దేశ గర్వకారణంగా మారిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. నవంబర్ 15, 2000 సంవత్సరంలో బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం విడిపోవడానికి ముందు, ఈ రెండు ప్రాంతాలు ఒకే ఉమ్మడి బీహార్‌గా ఉండేవి. అలా ఉమ్మడి బీహార్‌లో పుట్టి భారత క్రికెట్‌ను శాసించిన వారిలో మొదటి పేరు లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. రాంచీలో జన్మించిన ధోని 2004 లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసి దేశానికి రెండు ప్రపంచకప్‌లను అందించాడు. అలాగే పాట్నాలో పుట్టిన ఇషాన్ కిషన్ 2021 లో ఇంగ్లాండ్‌పై భారత జట్టులోకి ప్రవేశించి తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగాడు.
అంతర్జాతీయ వేదికపై మెరిసిన బీహార్ తారలు
వీరితో పాటు జేమ్‌షెడ్‌పూర్‌లో జన్మించిన సౌరభ్ తివారీ 2010 లో ఆస్ట్రేలియాపై, బొకారోలో జన్మించిన స్పిన్నర్ షాబాజ్ నదీమ్ 2019 లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున ఆడారు. అలాగే రాంచీలో జన్మించిన రాజేష్ చౌహాన్ 1993 లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేశారు. ఇక ప్రస్తుత భారత జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్లుగా రాణిస్తున్న రోహ్‌తాస్‌కు చెందిన ఆకాష్ దీప్ 2024లో ఇంగ్లాండ్‌పై, గోపాల్‌గంజ్‌కు చెందిన ముఖేష్ కుమార్ 2023 లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసి రాణించారు. వీరి కంటే ముందు పట్నాలో జన్మించిన మాజీ వికెట్ కీపర్ సబా కరీం 1997లో, పూర్ణియాకు చెందిన కీర్తి ఆజాద్ 1980లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మహిళల క్రికెట్‌లో బెట్టియాకు చెందిన కవితా రాయ్ 2000 సంవత్సరంలో శ్రీలంకపై భారత జట్టు తరఫున ఆడి బీహార్ ఖ్యాతిని పెంచారు. ఈ లెజెండ్స్ అందరి సరసన ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చేరి సరికొత్త చరిత్రను సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..