U19 Asia Cup 2025 : బౌలర్ల భీభత్సం..బ్యాటర్ల విధ్వంసం..శ్రీలంక పని పట్టిన యువ కెరటాలు.. ఫైనల్‎కు టీమిండియా

U19 Asia Cup 2025:దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి టీమిండియా గ్రాండ్‌గా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో ఆసియా కప్ టైటిల్ పోరులో మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది.

U19 Asia Cup 2025 : బౌలర్ల భీభత్సం..బ్యాటర్ల విధ్వంసం..శ్రీలంక పని పట్టిన యువ కెరటాలు.. ఫైనల్‎కు టీమిండియా
U19 Asia Cup 2025

Updated on: Dec 19, 2025 | 7:25 PM

U19 Asia Cup 2025:దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి టీమిండియా గ్రాండ్‌గా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో ఆసియా కప్ టైటిల్ పోరులో మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించడంతో ఆదివారం (డిసెంబర్ 21) జరగబోయే ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. సీనియర్ ఆసియా కప్ తరహాలోనే జూనియర్ స్థాయిలో కూడా ఇండో-పాక్ ఫైనల్ వార్ క్రికెట్ అభిమానుల్లో సెగలు పుట్టిస్తోంది.

దుబాయ్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌ను కాస్తా టీ20 ఫార్మాట్‌ (20 ఓవర్లు) కు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ విమత్ దిన్సర (32), చామిక హీనాతగిల (42) మాత్రమే రాణించగా, ఆఖర్లో సేతమిక 30 పరుగులతో స్కోరును పెంచాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కనిష్క్ చౌహాన్, పేసర్ హెనిల్ పటేల్ చెరో రెండు వికెట్లతో లంక నడ్డి విరిచారు.

139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (7), స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9) కేవలం 25 పరుగులకే అవుట్ అవ్వడంతో భారత అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విహాన్ మల్హోత్రా (61 నాటౌట్), ఆరోన్ జార్జ్ (58 నాటౌట్) శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 18 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆరోన్ జార్జ్ విన్నింగ్ ఫోర్‌తో మ్యాచ్ ముగించడం విశేషం.

ఈ టోర్నీలో భారత ప్రస్థానం అజేయంగా కొనసాగుతోంది. గ్రూప్ స్టేజ్‌లో యూఏఈని 234 పరుగుల తేడాతో, మలేషియాను 315 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కూడా గ్రూప్ మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫుల్ ఫామ్‌లో ఉన్న భారత్, ఇప్పుడు ఫైనల్లో పాకిస్థాన్‌ను ఎదుర్కోబోతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ గ్రూప్ మ్యాచ్‌ల్లో రికార్డు సెంచరీ (171) బాది ఫామ్‌లో ఉండటం, బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండటం భారత్‌కు పెద్ద బలం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..