టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సమరం.. సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్..!

TV9 Corporate Badminton Championship: కార్పొరేట్ ప్రపంచంలో కేవలం వ్యాపార వ్యూహాలే కాదు, ఆటల్లోనూ తామే సాటి అని నిరూపించారు ఐటీ దిగ్గజాలు. హోరాహోరీగా సాగిన టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్-2 గ్రాండ్ ఫినాలేలో అమెజాన్‌పై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరిత పోరులో విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సమరం.. సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్..!
Tv9 Cbc 2026

Updated on: May 17, 2026 | 5:29 PM

TV9 Corporate Badminton Championship: పుల్లేలా గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టీమ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టింది. కోర్టు నంబర్ 6లో జరిగిన ఈ తుది పోరులో ఐటీ దిగ్గజాలు అమెజాన్, టీసీఎస్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభంలో అమెజాన్ క్రీడాకారులు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. తొలి రెండు గేముల్లో అమెజాన్ వరుసగా 21-11, 21-12 తేడాతో టీసీఎస్‌పై విరుచుకుపడి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. దాంతో అమెజాన్ సులువుగా టైటిల్ గెలుస్తుందని అంతా భావించారు. మూడో గేమ్‌లోనూ 21-17తో గెలిచి అమెజాన్ తన పట్టును మరింత బిగించింది.

మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్.. టీసీఎస్ అద్భుత పోరాటం..!

వరుసగా మూడు గేములు ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో పడినప్పటికీ, టీసీఎస్ జట్టు ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇక్కడి నుంచే అసలైన అసమాన పోరాటం మొదలైంది. ఒక వైపు అమెజాన్ విజయం ఖాయమనుకున్న తరుణంలో, టీసీఎస్ ఆటగాళ్లు అద్భుత వ్యూహాలతో కోర్టులోకి దిగారు. వరుసగా తదుపరి నాలుగు గేములను 21-17, 21-18, 21-15, 21-16 తో కైవసం చేసుకుని అమెజాన్ శిబిరాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు.

మొత్తం 7 గేముల పాటు సాగిన ఈ సుదీర్ఘ మహాసంగ్రామంలో ఓటమి అంచుల్లోంచి లేచి వచ్చిన టీసీఎస్, అసాధారణమైన పోరాట పటిమతో విజేతగా నిలిచింది. పట్టుదల, జట్టులోని ఆటగాళ్ల మధ్య ఉన్న పరస్పర నమ్మకమే టీసీఎస్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాయి.

రన్నరప్‌గా అమెజాన్.. మూడో స్థానంలో ఇన్ఫోసిస్..!

చివరి వరకు అత్యంత ప్రతిభను కనబరిచి, తృటిలో టైటిల్‌ను చేజార్చుకున్న అమెజాన్ జట్టు రన్నరప్ (ద్వితీయ స్థానం) ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నమెంట్‌లో మరో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మూడో స్థానాన్ని (ద్వితీయ రన్నరప్) కైవసం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంది.

కాగా, మెన్స్ సింగిల్ విజేతగా గ్లాన్స్ (Glance) కు చెందిన ప్రజ్వల్ నిలవగా, ఉమెన్స్ సింగిల్ విజేతగా ఎన్ రంగారావు అండ్ సన్స్ కు చెందిన చిన్మయి, మిక్స్డాడ్ డబుల్స్ విజేతగా ర్యాన్ సంస్థకు చెందిన రాహుల్, భార్గవి పతకాలు అందుకున్నారు. దీంతో మూడు రోజుల పాటు అట్టహాసంగా సాగిన టీవీ9 కార్పొరేట్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ సీజన్ 2 నేటితో ముగిసింది.

కార్పొరేట్ ఉద్యోగుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన ఈ బ్యాడ్మింటన్ లీగ్ సరికొత్త జోష్ నింపింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క జట్టు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి, ఐక్యత ఈ పోటీలను చిరస్మరణీయంగా మార్చాయి. విజేతలుగా నిలిచిన టీసీఎస్ క్రీడాకారులకు, అద్భుత ప్రతిభ కనబరిచిన ఇతర జట్లకు నిర్వాహకులు, తోటి ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.

వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా క్రీడా మైదానంలోనూ పట్టుదల, సరైన వ్యూహం ఉంటే ఎంతటి కష్టమైన విజయాన్నైనా అందుకోవచ్చని టీసీఎస్ జట్టు నిరూపించింది. కార్పొరేట్ రంగంలో పని ఒత్తిడిని అధిగమించి, క్రీడల్లో ఇంతటి అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం నిజంగా అభినందనీయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us