Tilak Varma : తిలక్ వర్మ పై బీసీసీఐ వేటు? గతంలో గిల్‌కు జరిగినట్లే ఇప్పుడు తిలక్‌కూ తప్పదా ?

Tilak Varma : టీమిండియా టీ20 జట్టులో కీలక మార్పులపై ప్రశ్నలు మొదలయ్యాయి. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేలవ ఫామ్, బ్యాటింగ్ వైఫల్యంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో శుభ్‌మన్ గిల్ ఎదుర్కొన్న పరిస్థితుల మాదిరిగానే తిలక్ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tilak Varma  : తిలక్ వర్మ పై బీసీసీఐ వేటు? గతంలో గిల్‌కు జరిగినట్లే ఇప్పుడు తిలక్‌కూ తప్పదా ?
Tilak Varma

Updated on: Jul 08, 2026 | 6:55 PM

Tilak Varma : భారత క్రికెట్లో ప్రస్తుతం ఒక పెద్ద కుదుపు చోటుచేసుకుంది. కొన్నాళ్ల క్రితమే ఘనంగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు అదే ఫార్మాట్‌లో చాలా బలహీనంగా కనిపిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐర్లాండ్ చేతిలో ఫస్ట్ టైం టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ ఆశలను వదిలేసుకుంది. దీంతో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లతో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లు విమర్శల పాలవుతున్నారు. ఇప్పటికే సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తొలగించగా, ఇప్పుడు అందరి దృష్టి వైస్ కెప్టెన్ అయిన తిలక్ వర్మపై పడింది. అతని పేలవ ఫాం చూస్తుంటే.. గతంలో శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి డ్రాప్ చేయించినట్లే, ఇప్పుడు తిలక్‌ వర్మను కూడా బీసీసీఐ పక్కన పెట్టబోతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడటానికి సుమారు మూడున్నర నెలల సమయం పట్టింది. ఈ లోపే టీమిండియాలో సమూల మార్పులు జరిగాయి. అంతవరకు టీంను నడిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను కప్ గెలిచిన వెంటనే కెప్టెన్సీ నుంచి మాత్రమే కాకుండా ఏకంగా జట్టు నుంచి తొలగించారు. తన స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్‌గా ఉన్న సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నుంచి ఆ బాధ్యతలను లాక్కొని, యువ ఆటగాడు తిలక్‎ను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఈ రెండు నిర్ణయాలు కూడా ఇప్పటివరకు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోగా జట్టుకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.

సెలెక్టర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ పై దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉన్నందున తనుకు మరికొన్ని సిరీసులలో అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు ఆ ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి తిలక్ ప్రదర్శన గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. జట్టుకు అవసరమైన వేగంతో తను రుగులు చేయలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టులో అతని బ్యాటింగ్ పొజిషన్ మారడం కూడా ఒక సమస్యగా మారింది. కొన్ని నెలల క్రితం వరకు టాప్ ఆర్డర్‌లో 3 లేదా నాలుగో స్థానంలో ఆడిన తిలక్.. ఈషాన్ కిషన్ రీఎంట్రీతో ఇప్పుడు 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వస్తోంది. ఈ కొత్త రోల్‌లో తిలక్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తను పడుతున్న ఇబ్బందులు టీంను కలవరపెడుతున్నాయి.

తిలక్ వర్మ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇంగ్లండ్‌తో జరిగిన గత 3 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను కేవలం 114 స్ట్రైక్ రేట్‌తో కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతకుముందు ఐర్లాండ్ పర్యటనలో ఒక మ్యాచులో 74 పరుగులు చేసినప్పటికీ, అక్కడ కూడా అతని స్ట్రైక్ రేట్ కేవలం 100+గానే ఉంది. ఆధునిక టీ20 క్రికెట్‌లో ఇంత తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడటం టీం విజయాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగానే ప్లేయింగ్ 11లో తిలక్ వర్మ స్థానంపై మాజీలతో పాటు ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

ప్రస్తుత తిలక్ పరిస్థితిని చూస్తుంటే గతేడాది గిల్‌కు జరిగిన సీన్ గుర్తుకొస్తోంది. గిల్‌ను కూడా పెద్ద నమ్మకంతో టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. కానీ ఆ తర్వాత జరిగిన ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన, సౌతాఫ్రికా సిరీస్‌లలో అతని బ్యాట్ పనిచేయలేదు. వైస్ కెప్టెన్‌గా ఉంటూ ఫాం కోల్పోవడంతో అతనిపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు టీ20 ప్రపంచకప్‌నకు సరిగ్గా ముందే బీసీసీఐ అతని మీద వేటు వేసి జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి తిలక్ వర్మకు కూడా ఎదురు అవుతోంది. వైస్ కెప్టెన్ హోదాలో ఉండి కూడా జట్టుకు భారంగా మారుతున్న తిలక్ వర్మ విషయంలో బీసీసీఐ తదుపరి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us