
Tilak Varma: దోహా వేదికగా జరుగుతున్న మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో టీమిండియా కుర్రాళ్ల ప్రయాణం సెమీఫైనల్‌తో నిలిచిపోయింది. గురువారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు శ్రీలంక ఏ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో శ్రీలంక ఏ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంక విజయంలో లసిత్ క్రోస్ పుల్లె (116 పరుగులు), సినిత్ జయవర్ధనే (105 పరుగులు) కీలక పాత్ర పోషించారు, వీరిద్దరూ అద్భుతమైన శతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు బంతులు ఎక్కువగా మింగేశారు. తొలి 20 ఓవర్లలో ఎనిమిదికి పైగా స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ, ఆ తర్వాత 20 ఓవర్లలో కేవలం ఓవర్‌కు నాలుగు పరుగులు మాత్రమే చేశారు. ఈ దశలో స్ట్రైక్ రేట్ తగ్గడం వల్ల స్కోరు వేగం తగ్గిపోయింది. అయినప్పటికీ, చివర్లో షాబాజ్ అహ్మద్ సిక్సులు బాది, శ్రీలంక ముందు 317 పరుగుల మంచి టార్గెట్‌ను ఉంచడంలో సాయపడ్డాడు. మిడిల్ బ్యాటర్లు ఆరుకు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఉంటే, కచ్చితంగా 350కి పైగా టార్గెట్ ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
భారత్ ఏ జట్టు చేసిన 317 పరుగులను కాపాడుకోవడంలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. శ్రీలంక వికెట్లు తీయలేక చతికిలపడ్డారు, ఫలితంగా భారీ తేడాతో ఓటమిని చవిచూశారు. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఇండియా ఏ జట్టు ఓటమిపాలై రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ అనంతరం ఇండియా ఏ జట్టు ఓటమిపై కెప్టెన్ తిలక్ వర్మ స్పందించాడు. “బ్యాటింగ్ లో మొదటి 10 ఓవర్లలో మంచి ఆరంభమే దక్కింది. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ కొద్దిగా తగ్గినా, చివరికి 317 పరుగులు చేశాం. నిజం చెప్పాలంటే ఈ స్కోరు మంచి టార్గెట్టే. మేము గెలుస్తాం అనుకున్నాం. కానీ బౌలింగ్ లో నిరాశ పరిచాం” అని తిలక్ వర్మ అన్నాడు. “మొదట మేం బ్యాటింగ్ చేసేటప్పుడు తొలి 20 ఓవర్లలో బంతి చక్కగా బ్యాట్ పైకి వచ్చింది. కానీ ఆ తర్వాత కాస్త నెమ్మదిగా మారింది. అలాగే మిడిల్ ఓవర్లలో వరుసగా మూడు వికెట్లను కోల్పోయాం. లేకపోతే స్కోర్ బోర్డుపై ఇంకాస్త పరుగులు ఉండేవి. అయినా కూడా ప్రత్యర్థి ముందు మంచి టార్గెట్టే. కానీ బౌలింగ్ లో కాస్త మెరుగ్గా రాణించి ఉంటే బాగుండేది” అని వివరించాడు.
బౌలింగ్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, “మా బౌలర్లకు ముందే చెప్పాం. మొదటి 15 ఓవర్లు చాలా కీలకమని, ఓవర్ కు ఆరు లోపు పరుగులు ఇస్తే, ఆ తర్వాత ఓవర్లు వికెట్ కాస్త నెమ్మదిగా మారుతుంది అని మేము ప్రణాళికలు వేసుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు దానిని అమలు చేయలేకపోయాం. తొలి ఓవర్ల నుంచే తమ బౌలర్లు పరుగులు ఇవ్వడం ఎక్కడా ఆపలేదు. పైగా వికెట్లు తీయలేకపోవడం ఓటమిని శాసించింది” అని తిలక్ వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా చూసుకుంటే హర్షిత్ రానా, అర్షద్ ఖాన్ ఈ ఇద్దరు పవర్ ప్లే లో దారుణంగా పరుగులు ఇచ్చారు. వీరి చెత్త బౌలింగ్ కారణంగా శ్రీలంక ఏ జట్టు తొలి వికెట్ కు కేవలం 21.3 ఓవర్లలో 174 పరుగులు జోడించారు. ఆ తర్వాత కూడా టీమిండియా బౌలర్లు పరుగులు ఇస్తూనే ఉన్నారు. అంత పెద్ద టార్గెట్ ఇంకా 51 బంతులు మిగిలి ఉండగానే లంక విజయం సాధించింది. ఈ ఓటమి భారత యువ ఆటగాళ్లకు కీలక గుణపాఠంగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..