
IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లు ఆఖరి వన్డేకు దూరమవగా, మరొక ఆటగాడు ఏకంగా టీ20 సిరీస్‌కు కూడా సిద్ధంగా లేడు. బుధవారం జరిగిన రెండో వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు కుడి హ్యామ్‌స్ట్రింగ్‌లో నొప్పి రావడంతో పేస్ బౌలర్ నాండ్రే బర్గర్ మూడో వన్డేకు దూరం కానున్నాడు.
అదే మ్యాచ్‌లో రన్-చేజ్ సమయంలో బ్యాటింగ్ చేస్తుండగా గాయపడిన బ్యాట్స్‌మన్ టోనీ డి జోర్జి కూడా చివరి వన్డేలో ఆడలేకపోతున్నాడు. వీరికి స్కానింగ్‌లు నిర్వహించిన తర్వాత గాయాల తీవ్రత నిర్ధారణ కావడంతో, వీరిద్దరికీ ప్రత్యామ్నాయంగా ఎవరినీ జట్టులోకి తీసుకోకుండానే దక్షిణాఫ్రికా మిగిలిన ఆటగాళ్లలో నుంచే ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీ20 సిరీస్‌కు కూడా ఇద్దరు ఆటగాళ్లు ఔట్
సౌతాఫ్రికా జట్టుకు మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే.. గాయపడిన టోనీ డి జోర్జి కేవలం మూడవ వన్డేకు మాత్రమే కాకుండా, డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. అతను వెంటనే స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. దీంతో పాటు మరొక యువ పేస్ బౌలర్ క్వేనా మఫాకా ఫిట్‌నెస్ అంచనా వేసినంతగా మెరుగుపడలేదు.
లెఫ్ట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్న అతను కూడా టీ20 సిరీస్‌కు సిద్ధంగా లేకపోవడంతో, అతన్ని జట్టు నుంచి తప్పించారు. మఫాకా స్థానంలో యువ పేస్ బౌలర్ లుథో సిపామ్లాను టీ20 స్క్వాడ్‌లో చేర్చారు. ఈ గాయాల కారణంగా మూడవ వన్డే కోసం అందుబాటులో ఉన్న సౌతాఫ్రికా స్క్వాడ్‌లో ఐడెన్ మార్కరమ్, ర్యాన్ రికెల్టన్, కెప్టెన్ టెంబా బావుమా, వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, ప్రెనెలాన్ సుబ్రాయన్, ఓట్నీల్ బార్ట్‌మ్యాన్, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి, రుబిన్ హర్మన్ వంటి ఆటగాళ్లు మాత్రమే మిగిలారు.