
Rishabh Pant : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేకపోయింది. పిచ్ అసమానమైన బౌన్స్ ఉండడం వల్ల బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో వైస్-కెప్టెన్ రిషభ్ పంత్ జట్టు బాధ్యతలు తీసుకున్నారు. మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన పంత్, తమ ఓటమికి ప్రధాన కారణం ఏంటో స్పష్టం చేశారు.
కోల్‌కతా టెస్ట్‌లో ఓటమిపై మాట్లాడిన తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్.. “ఇలాంటి మ్యాచ్‌ల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేం ఈ టార్గెట్‌ను ఛేదించి ఉండాల్సింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాపై ఒత్తిడి పెరిగింది. దాన్ని మేం ఉపయోగించుకోలేకపోయాం” అని అన్నారు. ముఖ్యంగా సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, కార్బిన్ బాష్ కలిసి ఆడిన ఇన్నింగ్స్‌ను పంత్ ప్రధానంగా ప్రస్తావించారు. “టెంబా బవుమా, బాష్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ పార్ట్‌నర్‌షిప్ (8వ వికెట్‌కు 44 పరుగులు) వారిని మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చింది. అదే మాపై చాలా భారంగా మారింది” అని పంత్ అభిప్రాయపడ్డారు.
పంత్ మాట్లాడుతూ.. పిచ్ బౌలర్లకు సహాయం చేసిందనడంలో సందేహం లేదని, 120 పరుగుల టార్గెట్ కూడా కష్టంగా అనిపించిందని తెలిపారు. “ఒక జట్టుగా మేం ఒత్తిడిని తట్టుకుని, దాన్ని మాకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం మ్యాచ్ ఇప్పుడే ముగిసింది కాబట్టి మెరుగుదలల గురించి ఆలోచించలేదు. కచ్చితంగా మేం బలంగా తిరిగి వస్తాం” అని పంత్ ధీమా వ్యక్తం చేశారు.
సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా 136 బంతుల్లో 55 పరుగులు చేయగా, బాష్ 37 బంతుల్లో 25 పరుగులు చేశారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం ఆట మొదలైన మొదటి గంటలోనే భారత్‌ను నిరాశపరిచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ (31 పరుగులు) మాత్రమే అత్యధిక స్కోరు సాధించగా, కెప్టెన్ పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో తర్వాతి, చివరి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..