Kapil Dev: టీమిండియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్లలో ఒకరైన కపిల్ దేవ్ మైదానంలో ప్రశాంతంగా ఉంటారని మనందరికీ తెలుసు. అలాంటి ఆటతోనే ఈ లెజెండరీ ఆల్ రౌండర్ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. మైదానంలో కష్టపడడంతోపాటు నిజాయితీ ఆటతీరుతో ఆకట్టుకున్న కపిల్ దేవ్.. ఎల్లప్పడూ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేవాడు. కానీ, ఈ ప్రపంచ కప్ విజేత కొత్త అవతారంలో కనిపించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు యాప్ కోసం ఓ ప్రకటనలో నటించిన ఈ భారత మాజీ కెప్టెన్.. బాలీవుడ్ నటుడిని అనుకరించి ఆకట్టుకున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే రాహుల్ ద్రావిడ్, నీరజ్ చోప్రా, వెంకటేష్ ప్రసాద్ వంటి ప్రముఖులు ఇలాంటి యాడ్‌లో సందడి చేశారు. తాజాగా కపిల్ దేవ్ ఈ లిస్టులో చేరిపోయాడు.
ఐపీఎల్ 2021 ఫైనల్ రోజున సోషల్ మీడియాలో వచ్చిన ఈ వైరల్ ప్రకటనలో, కపిల్ దేవ్ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్‌ని అనుకరిస్తూ తన వ్యక్తిత్వానికి భిన్నంగా కనిపించి, ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రంలో కపిల్ దేవ్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కపిల్ ఇలా కూడా ఉంటాడా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. క్రికెట్ మైదానంలో ధగధగ మెరిసే దుస్తులు ధరించడం నుంచి ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేయడం వరకు అన్నీ ఈ వీడియో చూపించారు. భారత మాజీ కెప్టెన్ సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేయడం కూడా ఇందులో చూడొచ్చు.
అయితే అంతకుముందు రణ్‌వీర్ సింగ్ ఈ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటించి ఓ సినిమా తీసిని సంగతి తెలిసిందే. ఇండియా 1983 వరల్డ్ కప్ విజయాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ చిత్రంలో రణ్‌వీర్ ఆకట్టుకున్నాడు. దీనికి రివర్స్‌గానే కపిల్ దేవ్ ఈ బాలీవుడ్ నటుడి పాత్రను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను కపిల్ దేవ్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈమేరకు “నేను ఎంతో ఫ్యాషన్‌గా ఉన్నాను. ఇప్పటికీ నేను ఫ్యాషన్‌గా ఉన్నాను” అని పోస్ట్‌కి క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. కపిల్ దేవ్ అన్నట్లుగా ఈ వీడియోలో రకరకాల రంగుల దుస్తులు ధరించి వావ్ అనిపించారు.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్‌లో భారతదేశానికి చారిత్రాత్మక బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా.. ఆ తరువాత ఎంతో పెద్ద స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ టైంలోనే చేసిన ఓ ప్రకటన చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈఏడాది ప్రారంభంలో రాహుల్ ద్రావిడ్ కూడా తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఈ యాడ్‌లో నటించి నెట్టింటిని షేక్ చేశాడు. ఈ బ్రాండ్ కోసం “ఇందిరానగర్ కా గూండా” గా కనిపించాడు. అలాగే వెంకటేష్ ప్రసాద్ బాయ్ బ్యాండ్ “వెంగాబోయ్స్” లో ప్రధాన గాయకుడిగా నటించి తన నైపుణ్యాలను చాటుకున్నాడు.
Heads, I’m fashionable. Tails, I’m still fashionable. pic.twitter.com/vyKIrmLLOD
— Kapil Dev (@therealkapildev) October 15, 2021